రోహిత్‌ శర్మ కోపం.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్!

రోహిత్‌ శర్మ కోపం.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్!

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆటోబయోగ్రఫీ ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’లో తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను వెల్లడించాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసిన ఒక షాకింగ్ విషయాన్ని గబ్బర్ బయటపెట్టాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రేమాయణం
2006లో భారత్-‘ఎ’ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు, ఆ జట్టులో ధావన్‌తో పాటు రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. ఈ పర్యటనలోనే ధావన్ ఒక బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెను విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న గబ్బర్, ఆమెను తన హోటల్ గదికి కూడా తీసుకువచ్చేవాడట.

స్పోర్ట్స్‌స్టార్ కథనం ప్రకారం, తన చర్య అప్పటికి రూమ్‌మేట్ అయిన రోహిత్ శర్మకు ఎంతో విసుగు తెప్పించిందని గబ్బర్ తన పుస్తకంలో రాశాడు. “ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు నేను అకస్మాత్తుగా ప్రేమలో పడిపోయాను. ‘ఆమె నా కోసమే పుట్టింది.. తననే నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ మైకంలో తేలిపోయాను” అని ధావన్ పేర్కొన్నాడు.

“నువ్వు అసలు నన్ను నిద్రపోనిస్తావా?” – రోహిత్ శర్మ
“అప్పటికి జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నేను హాఫ్ సెంచరీ చేశాను. పర్యటన బాగానే జరుగుతోంది. ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమెను కలిసేందుకు వెళ్లేవాడిని. తనను నా హోటల్ రూమ్‌కు తీసుకువచ్చేవాడిని. అప్పుడు రోహిత్ శర్మ నాతో పాటు అదే గదిలో ఉండేవాడు. అయితే, తనకు ఇదంతా నచ్చేది కాదు. ‘నువ్వు అసలు నన్ను నిద్రపోనిస్తావా?’ అంటూ హిందీలో కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు” అని ధావన్ రాసుకొచ్చాడు.

ఒకరోజు సాయంత్రం ధావన్ ఆమెతో కలిసి డిన్నర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే వారి గురించి జట్టులో అందరికీ తెలిసిపోయిందట. “నేను ఆరోజు ఆమె చేయి పట్టుకుని హోటల్ లాబీ నుంచి వెళ్తుండగా.. జాతీయ జట్టులోని సెలక్టర్ ఒకరు మమ్మల్ని చూశారు. అయినా సరే నేను ఆమె చేతిని వీడలేదు. ఎందుకంటే.. నేను ఎటువంటి తప్పు చేయడం లేదని నాకు తెలుసు. ఆ పర్యటనలో బాగా రాణిస్తే జాతీయ జట్టులో చోటు దక్కుతుందని తెలుసు. కానీ రోజురోజుకూ నా ప్రదర్శన దిగజారిపోయింది” అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

ధావన్ కెరీర్, వ్యక్తిగత జీవితం
శిఖర్ ధావన్ రోహిత్ శర్మతో కలిసి చాలాకాలం టీమిండియా ఓపెనర్‌గా ఉన్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన గబ్బర్.. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20 మ్యాచ్‌లలో 1759 పరుగులు సాధించాడు.

ఇక శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లాడిన అతడు కొన్నేళ్ల క్రితం ఆమెతో విడిపోయాడు. ప్రస్తుతం ఐర్లాండ్ బ్యూటీ సోఫీ షైన్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయేషా-ధావన్‌లకు జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment