టాలీవుడ్ ప్రొడ్యూసర్, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో జరిగిన ఒక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ “నిజామాబాద్‌లో ఈవెంట్‌కు తక్కువ రియాక్షన్ ఉంది. ఆంధ్రాలో జరిగితే ప్రతి సినిమాకు ఒక వైబ్ వస్తుంది, కానీ తెలంగాణలో తెల్ల కల్లు, మటన్‌కే వైబ్ ఉంటుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ ఆగ్రహం..
దిల్ రాజు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో వైబ్ లేకుంటే, మీ సినిమాలు ఇక్కడ మానేయండి అని సూచించారు. “వైబ్ కావాలంటే కల్లు కాంపౌండ్‌లు, మాంసం దుకాణాలు పెట్టుకోవాలా?” అని ప్రశ్నించారు. దిల్ రాజు తెలంగాణ సంస్కృతిపై సెటైర్లు వేయడంపై దేశపతి తీవ్రంగా మండిపడ్డారు. సీఎం సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ఆర్డర్లు తెచ్చుకున్న దిల్ రాజు, ఇప్పుడు తెలంగాణపై విమర్శలు చేయడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.