ఢిల్లీలో మరోసారి మహిళ ముఖ్యమంత్రి (Woman CM)గా నియమితులవుతారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ (BJP)లోని పలువురు నాయకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ (Delhi Elections)లో కాషాయ జెండా ఎగిరింది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముఖ్యమంత్రి పదవిని మహిళకు కట్టబెట్టాలని పార్టీ నిర్ణయిస్తే, ఆ అవకాశాన్ని ఎవరు అందుకుంటారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వెనకబడిన వర్గాల నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మహిళలు, దళితులు, ఇతర వెనకబడిన వర్గాలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ అంశంపై బీజేపీ నాయకత్వం ఇప్పటికే మంతనాలు జరుపుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై విజయం సాధించిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ముందున్నట్లు వార్తలు వస్తున్నా, అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. షాలిమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా. నజఫ్ గఢ్ నుంచి నీలం పెహల్వాన్, గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్, వాజీపూర్ నుంచి పూనం శర్మ విజయం సాధించారు. మరి వీరిలో ఎవరు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీకి మహిళా సీఎంలు వీరే..
ఇప్పటి వరకు ఢిల్లీకి ముగ్గురు మహిళలు సీఎంలుగా పనిచేశారు. బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్1998లో కేవలం 52 రోజులపాటు సీఎం పదవిలో కొనసాగారు. షీలా దీక్షిత్ (కాంగ్రెస్) 15 సంవత్సరాలపాటు (1998-2013) ఢిల్లీ సీఎంగా కొనసాగారు. ఆతిశీ (ఆమ్ ఆద్మీ పార్టీ) నాలుగున్నర నెలలపాటు పదవిలో ఉన్నారు.