దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రజలకు వాగ్దానాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా “జీవన్ రక్ష యోజన” పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ హామీ ఢిల్లీ ఎన్నికల్లో గేమ్‌ఛేంజర్ అవుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ హామీలపై అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని బుధవారం ప్రకటించారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం ఇదే పథకాన్ని విజయవంతంగా అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఈ పథకం ద్వారా ప్రజలకు ఉపయోగం చేకూర్చామన్నారు. ఢిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపర్చడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
మరో హామీ.. ప్యారీ దీదీ యోజన
ఇతర హామీలలో భాగంగా “ప్యారీ దీదీ యోజన” కింద ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.2,500 అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇటీవల ప్రకటించింది. ఫిబ్రవరి 5వ తేదీన 70 శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఢిల్లీ ప్రజలపై ఎంత ప్రభావం చూపుతాయో వేచిచూడాలి.