దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట (Red Fort) సమీపంలో నవంబర్ 10న చోటుచేసుకున్న బాంబు పేలుడు కేసు దర్యాప్తు దిశను మార్చేసే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుండాయ్ ఐ20 (Hyundai i20) కారులో మృతదేహంగా దొరికిన వ్యక్తి మరెవరో కాదు, కాశ్మీర్‌కు చెందిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (Dr.Umar Nabi) అని పోలీసులు మరియు ఫోరెన్సిక్ బృందాలు అధికారికంగా నిర్ధారించాయి.
దర్యాప్తు అధికారులు DNA పరీక్షల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కారు శిథిలాల నుంచి వెలికితీసిన కాలిపోయిన మృతదేహం నమూనాలు ఉమర్ కుటుంబ సభ్యుల DNAతో 100% సరిపోలినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. దాడి వెనుక ఉమర్ ఉన్నట్లు స్పష్టమైంది.
ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలక పాత్ర
పేలుడుకు ఉపయోగించిన వైట్ హ్యుండాయ్ ఐ20 కారు ఉగ్రవాది ఉమర్ పేలుడుకు 11 రోజుల ముందు కొనుగోలు చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. అతను ఫరీదాబాద్‌లోని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White-Collar Terror Module) లో ప్రధాన సభ్యుడిగా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఉమర్ కుటుంబం పుల్వామా (Pulwama) జిల్లాలోని సంబురా (Sambura) గ్రామానికి చెందినది. ఉమర్ తల్లి, సోదరుడి DNA నమూనాలు తీసి, పేలుడులో దొరికిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలతో పోల్చగా, ఫలితాలు పూర్తిగా సరిపోలాయి.
టర్కీ హ్యాండ్లర్‌తో రహస్య సంప్రదింపులు
దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, ఉమర్ తీవ్రవాద కార్యకలాపాల్లో భాగస్వామిగా మారిన విషయం కుటుంబానికి ముందే తెలిసినా, వారు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వలేదట. ఉమర్ సెషన్ యాప్ (Session App) ద్వారా టర్కీలోని అంకారా (Ankara)లో ఉన్న తన హ్యాండ్లర్ ‘ఉకాసా’ (Ukasa – code name)తో నిరంతరం రహస్యంగా చర్చలు జరిపేవాడు. ఈ DNA నిర్ధారణతో ఢిల్లీ బాంబు దాడి వెనుక ఉన్న ఉగ్రజాలం రూపం స్పష్టమవుతూ, దేశ భద్రతా సంస్థలు మరిన్ని అంతర్జాతీయ లింకులను పరిశీలిస్తున్నాయి.








