బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘కల్కి-2’ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నా, దీపికా మాత్రం తన ప్రాధాన్యతలను స్పష్టంగా వెల్లడించారు. “నాకూ ‘కల్కి-2’పై ఆసక్తి ఉంది. కానీ, నా జీవితంలో నా మొదటి ప్రాధాన్యత నా కుమార్తె దువా. ఆమెను పెంచడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మా అమ్మ నన్ను దగ్గరుండి చూసిన విధంగా, నేను కూడా దువాను పెంచాలని అనుకుంటున్నాను. ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం” అని దీపికా చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల మధ్య చర్చకు దారి తీశాయి.
కల్కి-2 టైటిల్ మారుస్తున్నారా..?
ఇదిలా ఉండగా.. మరికొందరు కల్కి-2లో కూడా దీపికా పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. రెండవ భాగానికి పేరు మారుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కల్కి-2 కాకుండా మరో టైటిల్ ఫిక్స్ అయిందని అంటున్నారు. అదేంటంటే ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కల్కి టైటిలే కల్కి 2898 AD అని ఉంటుంది. కానీ, కర్ణ 3102 BC అంటే ఏంటి అని అంతా షాక్ అవుతున్నారు. కథ నెమ్మదిగా కలియుగం నుంచి మహాభారతంలోకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది.
సెకండ్ పార్టులో దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కువగా మహాభారత దృశ్యాలను, కర్ణుడు, అశ్వథామ మధ్య జరిగిన సన్నివేశాలను చూపించబోతున్నారట. అదే విధంగా కమల్ హాసన్ యాస్కిన్ పాత్రకి సంబందించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని టాక్. కలియుగం నుంచి మహాభారతంలోకి అంటే భవిష్యత్తు నుంచి గతంలోకి వెళుతుంది కాబట్టి టైటిల్ లో బిసి అని వచ్చేలా చేశారు. ఇటీవల స్వప్న, ప్రియాంక దత్ కూడా కల్కి 2 గురించి స్పందించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది అని తెలిపారు.