తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad) తీరు అనంతపురం అర్బన్ ప్రజలకు చిరాకుగా మారింది. ప్రతి దందాలో ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకు పాల్పడడం, మాట వినని వారితో డైరెక్ట్ ఎమ్మెల్యే ఫోన్లు మాట్లాడి బండ బూతులు మాట్లాడడం ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. జూ.ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్(NTR)ను, అతని తల్లిని దూషించిన అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. తాజాగా మరో ఆడియో లీక్‌తో సంచలనంగా మారారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్(Nara Lokesh)కు సన్నిహితుడు కావడంతోనే, ఆయన అండదండలతోనే దగ్గుబాటి రెచ్చిపోతున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
అనంతపురం అర్బన్ పరిధిలో ఓ స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో మహిళా డాక్టర్‌ను ఉద్దేశిస్తూ ఫోన్లో దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (Andhra Pradesh Women’s Federation) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహిళలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిత్రపటానికి నిప్పంటించి తమ అసహనాన్ని వెల్లడించారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఉండి కూడా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంతకీ ఏమైందంటే..
అనంతపురం నగరంలోని సాయినగర్ (Sai Nagar) ప్రాంతంలో ఆస్రా (Asra) అనే మహిళ ఒక ఆప్టికల్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమెకు, ఎమ్మెల్యే బావమరిదికి మధ్య భూవివాదం కొనసాగుతోందని ఆరోపించారు. ఈ వివాదంలో మహిళకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరిగిందని, అందులో ఎమ్మెల్యే స్వయంగా జోక్యం చేసుకున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో ఫోన్ కాల్లో మహిళను ఉద్దేశించి అనరాని మాటలు మాట్లాడినట్టు ఆరోపించారు. కాల్ ఆడియో విన్న ప్రతిఒక్కరూ ఇది బాధ్యతగల ఎమ్మెల్యే మాట్లాడాల్సిన భాషేనా అని ప్రశ్నిస్తున్నారని మహిళా సంఘాలు పేర్కొన్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.







