మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అనంతపురం (Anantapur) ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggubati Prasad) పేరు మరోసారి వివాదాల్లో మారుమోగుతోంది. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సుమయ (Dr. Sumaya) భర్తను బెదిరిస్తున్నట్లు ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఆడియోలో ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడ్డట్లు స్పష్టంగా వినిపిస్తోంది. డాక్టర్‌ను ఉద్దేశించి కూడా అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డాక్టర్ సుమయ తనపై, తన కుటుంబంపై ఎమ్మెల్యే కుట్ర పన్నుతున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతోనే తమను టార్గెట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఆగస్టు 2025లోనే ఒక వీడియోను విడుదల చేసినట్లు తెలిపారు. తమ ఆసుపత్రికి కొందరు వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఎలాంటి తప్పు చేయకపోయినా తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై డీఎస్పీ (DSP)కి ఫిర్యాదు చేసిన అనంతరం తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని డాక్టర్ సుమయ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, దగ్గుపాటి ప్రసాద్ ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)ను దూషించినట్లుగా ఉన్న మరో ఆడియో కూడా వైరల్ కావడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. తాజా ఆడియోతో మరోసారి ఆయనపై విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment