కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, సమస్యల పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ (DRC meeting)లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు హాజరుకావాల్సిన ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నేత, పవన్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సమావేశానికి హాజరైన వర్మ గెస్ట్ సీటులో కాకుండా ఏకంగా శాసనసభ సభ్యుల స్థానంలో ఆసీనులయ్యారు. పిఠాపురం ఎమ్మెల్యే తరఫున టీడీపీ నేత వర్మ ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల స్థానంలో టీడీపీ నేత కూర్చోవడం ఏంటని అధికారులు సైతం ముక్కునవేలేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, వర్మకు ఏ అర్హత ఉందని డీఆర్సీ మీటింగ్‌కు హాజరై ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా, ఇటీవల పిఠాపురంలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ టీడీపీ నేత వర్మ ఎమ్మెల్యే హోదా పాల్గొంటున్నారు. దీంతో స్థానికంగా ఉండే జనసేన నాయకులు, కార్యకర్తలకు మింగుపడడం లేదట. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వర్మ వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జనసేన పార్టీ కార్యకర్తలు వర్మపై దాడికి యత్నించి కారు అద్దాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.