పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ అల్-నాస్ర్‌తో తన ఒప్పందాన్ని పొడిగించుకున్నాడు. మరో రెండేళ్ల పాటు అల్-నాస్ర్ క్లబ్ తరపున ఆడేందుకు రొనాల్డో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని అల్-నాస్ర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “క్రిస్టియానో రొనాల్డో 2027 వరకు అల్-నాస్ర్ ఫుట్‌బాల్ క్లబ్‌లో కొనసాగనున్నాడు” అని ఎక్స్‌లో రాసుకొచ్చింది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రొనాల్డో, 2022 డిసెంబర్‌లో అల్-నాస్ర్ క్లబ్‌తో జతకట్టాడు.
గత ప్రదర్శన, ప్రస్తుత నిర్ణయం
గత రెండు సీజన్లలో సౌదీ ప్రో లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, రొనాల్డో అల్-నాస్ర్‌కు టైటిల్‌ను మాత్రం అందించలేకపోయాడు. దీంతో ఈ పోర్చుగల్ కెప్టెన్ అల్-నాస్ర్‌కు వీడ్కోలు పలికి మరో క్లబ్‌తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అల్-నాస్ర్ క్లబ్ యాజమాన్యంతో చర్చల అనంతరం రొనాల్డో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
రొనాల్డోకు కళ్లు చెదిరే ఆఫర్ వివరాలు:
సౌదీ ఫుట్‌బాల్ క్లబ్‌తో తన కాంట్రాక్ట్‌ను రెండేళ్ల పాటు పొడిగించుకున్నందుకు రొనాల్డో భారీ మొత్తాన్ని అందుకోనున్నట్లు సమాచారం. టాక్ స్పోర్ట్ రిపోర్ట్ ప్రకారం, రొనాల్డోకు దక్కనున్న బెనిఫిట్స్ వివరాలు:
వార్షిక పారితోషికం: ఏడాదికి 178 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2000 కోట్లు).
సైనింగ్ బోనస్: తొలి ఏడాదికి 24.5 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 261 కోట్లు).
రెండో ఏడాది బోనస్: ఇది 30 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 405 కోట్లు)కు పెరగనుంది.
ఆసియా ఛాంపియన్స్ లీగ్ బోనస్: అల్-నాస్ర్ ఆసియా ఛాంపియన్స్ లీగ్ గెలిస్తే 5 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 53.4 కోట్లు) బోనస్ లభిస్తుంది.
సౌదీ ప్రో లీగ్ ఛాంపియన్ బోనస్: అల్-నాస్ర్ సౌదీ ప్రో లీగ్ గెలిస్తే రొనాల్డోకు 8 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 85 కోట్లు) బోనస్ దక్కనుంది.
గోల్డెన్ బూట్ బోనస్: గోల్డెన్ బూట్ గెలిస్తే రొనాల్డోకు 4 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 42 కోట్లు) బోనస్ లభిస్తుంది.
అల్-నాస్ర్‌లో ఓనర్‌షిప్: అల్-నాస్ర్‌లో 15 శాతం ఓనర్‌షిప్ (అంచనా ప్రకారం 33 మిలియన్ పౌండ్లు) రొనాల్డో ఖాతాలో చేరనుంది.
ప్రతి గోల్‌కు: ప్రతి గోల్‌కు రొనాల్డోకు 80 వేల పౌండ్లు (సుమారు రూ. 85 లక్షలు) నగదు బహుమతిగా దక్కనుంది. ఈ బోనస్ రెండో ఏడాదికి 20 శాతం పెరగనుంది.
ప్రైవేట్ జెట్: ప్రైవేట్ జెట్ ఖర్చులు కూడా అల్-నాస్ర్ క్లబ్ భరించనుంది.