క్రికెట్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు కోల్పోయిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తెలంగాణలో కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆ కుటుంబానికి భరించలేని విషాదాన్ని మిగిల్చింది.
ఏం జరిగింది..?
సోమేశ్ తెల్లవారు 4 గంటల సమయంలో రైలు పట్టాలపై పడుకొని ప్రాణాలు తీసుకున్నాడు. అతను లక్షల్లో క్రికెట్ బెట్టింగ్ పెట్టి డబ్బు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. గతంలో కూతురు పెళ్లి కోసం అప్పు చేసిన కొడుకు.. దాన్ని తీర్చినా, బెట్టింగ్ నుంచి బయటపడలేకపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు.
ఎవరైనా తమ కొడుకును టార్చర్ చేశారా? రాత్రి ఏం జరిగింది? అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
స్నేహితులకు చివరి సందేశం..
సోమేశ్ చనిపోకముందు తన స్నేహితులకు వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేశాడు. అందరూ అక్కడికి చేరుకునేసరికి ఆయన మృతదేహం కనిపించిందని స్నేహితులు చెప్పారు.
బెట్టింగ్ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
సోమేశ్ కుటుంబసభ్యులు “ఈ బాధ ఇంకెవరూ అనుభవించకూడదు.. ప్రభుత్వం వెంటనే బెట్టింగ్ యాప్స్‌పై చర్యలు తీసుకోవాలి” అంటూ విజ్ఞప్తి చేశారు.