ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన తరువాత ఇప్పుడు ఖజానా ఖాళీ అయ్యిందని సూపర్ సిక్స్ పథకాల (Super Six schemes)పై చేతులెత్తేయడం సమంజసం కాదన్నారు. ఖజానా ఎప్పుడు ఖాళీ అయ్యిందో, ఎప్పుడు గమనించారో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సూటిగా ప్రశ్నించారు.
అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చి పవర్‌లోకి రాగానే ఖజానా ఖాళీ అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల్లో చెప్పినట్లుగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాల్సిందేనని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే ప్రజాపోరాటం తప్పదని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు రూ.20 వేలు, మహిళలకు నెలకు రూ.1500, తల్లికి వందనం, మహిళలకు ఫ్రీ బస్సు అన్నీ అమలు చేయాల్సిందేనన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని ప్రచారం చేసిన కూటమి నేతలు.. నేడు అధికారంలోకి వచ్చి మీరు చేస్తున్నదేంటి? అని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. రాజధానికి కేంద్రం నుంచి ఏమీ సాధించలేక.. అమరావతి నిర్మాణం కోసం అప్పు తెస్తున్నారని, రాష్ట్రంలో సమస్యలు పరిష్కారానికి అప్పులపై ఆధారపడుతున్నారన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 32 లక్షల మంది కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని సీపీఐ రామకృష్ణ గుర్తుచేశారు. దాదాపు 99% ప్రజలకు వారి పేరు మీద ఇళ్ల పట్టాలు ఉన్నాయని, ఇంటి నిర్మాణం పూర్తవని వారందరికీ జీవో సవరించి పట్టణంలో-2, గ్రామాల్లో-3 సెంట్లు ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 26 వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లపట్టాలపై సీపీఐ వినతి పత్రాల కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. అర్జీదారులను సమీకరించి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల్లో “ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.