మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు పూర్తిగా దగ్ధమై, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీస్ దర్యాప్తులో ఆశ్చర్యమైన విషయాలు బయటకు వచ్చాయి. శ్రీరామ్ (26), లిఖిత (16) ఇద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లిఖిత స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శ్రీరామ్ ఘట్‌కేసర్ సమీపంలో సైకిల్ షాపు నడిపిస్తున్నాడు. ప్రేమజంట రహస్యంగా ఉన్న సమయంలో వారిని చూసిన కొందరు వ్యక్తులు, వారిని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
వారి వేధింపులు బరించలేక ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు శ్రీరామ్ తన సోదరికి ఫోన్ చేసి తెలిపాడు. అనంతరం ఘనాపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు చేరుకొని కారులో నిప్పంటించుకుని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటన స్థలంలో మూడు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.