ఇప్పటి యువతలో చాలామంది సోషల్ మీడియా, రీల్స్, ఆన్‌లైన్ బెట్టింగులు, డ్రగ్స్, లవ్ ఫెయిల్యూర్స్ వంటి వ్యసనాల్లో మునిగిపోతుంటే, కష్టాలను జయించి జీవితాన్ని విజయవంతంగా మార్చుకుంటున్న వారు అరుదుగానే కనిపిస్తున్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తున్నారు అవిభక్త కవలలు వీణా–వాణి. వీరి పేరు చెప్పుకొని కొందరు ప్రముఖులు ఫండ్స్ కలెక్ట్ చేసి సొంత అవసరాలకు వాడుకొని చేసిన మోసం.. వీరిలో పట్టుదలను మరింత పెంచాయి.
పుట్టుకతోనే వైకల్యం ఉన్నా, పట్టుదలతో చదువులో సత్తా చాటుతూ తాజాగా డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పుడు సీఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని స్టేట్ హోమ్‌లో నివసిస్తున్న వీణా–వాణి గతేడాది తమ 22వ పుట్టినరోజును జరుపుకున్నారు. అప్పటి వరకు టెన్త్, ఇంటర్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఈ అక్కాచెల్లెళ్లు తాజాగా డిగ్రీలో డిస్టింక్షన్ సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ వీరిని ఆణిముత్యాలు అంటూ నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
వీణా–వాణిల చదువులో ఆసక్తిని గమనించిన యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఏజీఎం సుధాకర్ వారికి ముఖ్యమైన సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందుకు వీరు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం తమను ప్రత్యేకంగా సంరక్షించిందని, అందుకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
వీణా-వాణీల నేపథ్యం..
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరశెట్టిగూడెంకు చెందిన మారగాని మురళీ–నాగలక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు ఉండగా, వీణా–వాణి రెండో సంతానం. 2003 అక్టోబర్ 16న జన్మించిన వీరికి ఇప్పుడు 23 ఏళ్లు. చిన్ననాటి నుంచి బాలసదన్‌లోనే పెరిగిన వీరు, చదువుపై ఆసక్తి పెంచుకుని ఒక్కో మెట్టుపైకి ఎక్కారు. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి సీఏ పరీక్షలకు సిద్ధమవుతున్న వీణా–వాణి కృషి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. శారీరక వైకల్యం ఉన్నా, సంకల్పంతో చదువుకుని విజయాలను అందుకోవచ్చని నిరూపించారు. గ్రామస్థులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు వీరికి అభినందనలు తెలుపుతూ “పిల్లలంటే ఇలాగే ఉండాలి” అని ప్రశంసలు కురిపిస్తున్నారు.