లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్ర‌భుత్వం భారీ సాయం

లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్ర‌భుత్వం భారీ సాయం

ల‌క్ష్మీనాయుడు హ‌త్య కేసు వివాదం తీవ్ర‌రూపం దాల్చ‌డంతో ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. కందుకూరు పట్టణానికి సమీపంలో గుడ్లూరు మండలంలోని దారకానిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ల‌క్ష్మీనాయుడు హ‌త్య‌కు గుర‌య్యాడు. హరిశ్చంద్ర ప్రసాద్ కారుతో గుద్ది లక్ష్మీనాయుడు హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనపై కాపు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం బాధిత కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించింది.

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లక్ష్మీనాయుడు భార్యకు 2 ఎకరాల భూమి మరియు రూ.5 లక్షల నగదు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, వారి ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి కేటాయించి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు. పిల్లల విద్యాబాధ్యతను కూడా ప్రభుత్వం భరించనున్నట్లు సీఎం తెలిపారు. కారు దాడిలో గాయపడిన పవన్ మరియు భార్గవ్‌ల‌కు కూడా పరిహారం ప్రకటించారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షలు మరియు వైద్య ఖర్చులు, భార్గవ్‌కు రూ.3 లక్షలు మరియు చికిత్స ఖర్చులు అందజేయనున్నారు.

అయితే, ఈ ప్రభుత్వ నిర్ణయం చుట్టూ మ‌రో కొత్త వివాదం చెల‌రేగుతోంది. గతంలో టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా రెండు కుటుంబాల మ‌ధ్య‌ కలహాలు, వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో తోట చంద్రయ్య అనే టీడీపీ కార్య‌క‌ర్త మృతిచెందాడు. దాన్ని రాజ‌కీయ హ‌త్య‌గా, వైసీపీ నేత‌లు హ‌త‌మార్చిన‌ట్లుగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం కోసం వాడుకున్న తెలుగుదేశం పార్టీ.. ల‌క్ష్మీనాయుడు హ‌త్య‌ను మాత్రం ఆర్థిక లావాదేవీలు, వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు వ‌ల్లేన‌ని తేల్చ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

పోలీసులు, అధికారులు, ఎమ్మెల్యేలు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చినట్లే.. తోట చంద్ర‌య్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ప్రయత్నించినా బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందలేదని గుర్తుచేస్తున్నారు. తాజా పరిణామంపై రాజకీయ వర్గాల్లో మిశ్ర‌మ చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment