ఇటీవల జరిగిన ‘లైలా’ మూవీప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు, జనసేన పార్టీ నేత పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పమయ్యాయి. లైలా చిత్ర యూనిట్‌ను డైలమాలో పడేశాయి. ఫృథ్వీ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రేక్షకులు, వైసీపీ అభిమానులు ధ్వజమెత్తారు. సినీ వేదికపై రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపడంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో బాయ్‌కాట్ హ్యాష్ ట్యాగ్‌ను దేశ వ్యాప్తంగా రెండ్రోజులు ట్రెండింగ్‌లో నిలిపిన విషయం తెలిసిందే.
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై మైక్ పట్టుకొని సినిమా మొదట్లో 150 మేకలు.. సినిమా పూర్తయిన తరువాత 11 మేకలు అని వైసీపీని ఉద్దేశించి ఇండైరెక్ట్‌గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీ కామెంట్స్ చేశాడు. దీంతో వైసీపీ అభిమానులు ట్విట్టర్ వేదికపై లైలా సినిమాను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించేశారు. దీంతో లైలా హీరో విశ్వక్‌సేన్, నిర్మాత ఇద్దరూ కలిసి ప్రెస్‌మీట్ పెట్టి ఫృథ్వీ తరఫున క్షమాపణలు చెప్పారు.
లైలా సినిమాపై తమకు ఎలాంటి కోపం లేదని, తప్పు చేసిన వ్యక్తి మాత్రమే క్షమాపణలు కోరాలని వైసీపీ అభిమానులు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫృథ్వీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాడు. “వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. నా వల్ల సినిమా దెబ్బతినకూడదు. అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. బాయ్‌కాట్ ‘లైలా’ అనకుండా, వెల్కమ్ ‘లైలా’ అని చెప్పండి. ‘లైలా’ పెద్ద హిట్ కావాలి” అని కోరాడు. ఈ వివాదంపై పృథ్వీ ఇచ్చిన వివరణతో ఈ అంశానికి ముగింపు ఏర్పడుతుందా? లేక ఇంకేమైనా మలుపులు తిరుగుతాయా అనేది చూడాలి.








