జస్ట్ ఇమ్యాజిన్.. ఏపీలో (Andhra Pradesh) అత్యంత అభివృద్ధి చెందిన నగరం ఏది..? అని కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్ వస్తే.. కచ్చితంగా ఎవరైనా టిక్ పెట్టే ఆన్సర్ విశాఖ. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత గ్లోబల్ సిటీగా పేరున్న నగరం. 1300 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న విశాఖ (Visakhapatnam) నగరంలో నివసించే జనాభా 24.40 లక్షలు. విశాఖ ఆర్థిక శక్తి సంవత్సరానికి 44 బిలియన్ డాలర్లు. పొడవైన సముద్ర తీరం, ఇండస్ట్రీయల్ కారిడార్స్ (Industrial Corridors), పోర్టులు (Ports) వీటన్నింటికీ అనుబంధంగా సాగే వ్యాపారాలు.. బహుశా అందుకేనేమో గత వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) ఈ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా (Executive Capital) ఎంపిక చేసుకుంది. దీంట్లో భాగంగానే ప్రభుత్వం నిర్మాణాలకు ఉద్దేశించిన భూములు ఇప్పుడు రూపాయికే పోతున్నాయి.
కాపాడిన భూములు.. కారుచౌకగా..
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని (Capital) కోసం ఉద్దేశించిన విలువైన భూములను ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల పేరు చెప్పి కంపెనీలకు రూపాయికి (Rupees), పావలా (Paise)కు అప్పగిస్తున్నారన్న విమర్శలు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి తీవ్రంగా వినిపిస్తున్నాయి. కోట్లు విలువ చేసే ఆ భూములను ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తే.. ప్రస్తుత ప్రభుత్వం చడీచప్పుడు కాకుండా కేటాయిస్తుందని ఉత్తరాంధ్రవాసులు గుర్రుగా ఉన్నారు. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలనే నెపంతో విశాఖపట్నంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకకు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల వినియోగార్థం ఉంచిన భూములను ప్రభుత్వ తన అధికారం ఉపయోగించి నిశ్శబ్దంగా, నిబంధనల్ని పక్కన పెట్టి వేల కోట్ల రూపాయల విలువగల భూములను ఊరూపేరు లేని కంపెనీలకు రూపాయి కంటే తక్కువ ధరకు కట్టబెట్టి కొంతమందికి లబ్ధిచేకూర్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
పెరిగిన భూముల ధరలు
భారతదేశంలోనే మొదటి నావికా స్థావరం, పురాతన షిప్‌యార్డ్, అరుదైన భూమి ఖనిజాల వెలికితీత ప్లాంట్ విశాఖపట్నంలోనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పేరున్న నగరం కావడంతో అప్పటికే విశాఖ భూములకు బాగానే డిమాండ్ ఉండేది. జగన్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అనౌన్స్ చేయడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పెరిగిన ధరలు విశాఖ నగరానికి ఉన్న ప్రాబల్యానికి నిదర్శనం. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తరువాత విశాఖలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం విలువైన గవర్నమెంట్ ల్యాండ్‌ను వైసీపీ హయాంలో గుర్తించారు.
విజన్ విశాఖతో బ్రాండింగ్..
రాష్ట్రంలో ఎకానమీని జనరేట్ చేయగల శక్తి గల విశాఖకు కొంచెం ఊతం ఇస్తే ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి సిటీలతో పోటీపడుతుందనేది వైసీపీ ఉద్దేశం. కొంచెం పెట్టుబడి పెట్టి విశాఖను అభివృద్ధి చేస్తే తిరుగులేని ఆర్థిక శక్తిని అందించే నగరంగా ఎదుగుతుందని భావించారు. తద్వారా ఆదాయాలు లభిస్తాయని భావించారు. ఎకానమీ ఇంజిన్‌గా విశాఖ మారుతుందని గ్రహించారు. జస్ట్ రూ.10,000 కోట్లు పెడితే మార్ప వస్తుందనుకున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తూ విశాఖకు బ్రాండింగ్ కల్పించాలనే ఉద్దేశంతో విజన్ విశాఖ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖకు ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో వివరించారు. రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి రూ. లక్ష కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు ‘విజన్ విశాఖ’ డాక్యుమెంట్లో వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఆ ధరకు టాటా ఎలా ఒప్పుకుందనేది సందేహం..
తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు హిల్ నెంబర్ 3లో 21 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం కేటాయించిన విషయం వెలుగులోకి వచ్చింది. TCS రూ.1,370 కోట్ల పెట్టుబడి ద్వారా 12,000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. అయితే, సంస్థకు ఈ భూమిని లీజుపై కేవలం 99 పైసలకే కేటాయించినట్లు వార్తలు చెబుతున్నాయి. అంతటి ప్రతిష్ఠాత్మక సంస్థ, విలువలకు కట్టుబడి నడిచే కంపెనీ ఈ స్థాయిలో తక్కువ ధరకు భూమి తీసుకోవడం కూడా ఆశ్చర్చమనే చర్చ కూడా జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఉత్సాహమా, లేక మరేదైనా ఉద్దేశమా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
లాభాపేక్ష ఏమైనా ఉందా..?
ఇక TCS పక్కనే ఉర్సా అనే సంస్థకు కూడా భూమి కేటాయించిన అంశం మరింత దుమారం రేపుతోంది. ఈ సంస్థను కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు లేకుండా, కేవలం ఇద్దరు డైరెక్టర్లతో పని చేస్తున్న ఈ సంస్థకు అంత విలువైన భూమి ఎలా కేటాయించబడింది? అన్న ప్రజల ప్రశ్నలు మరింత తీవ్రంగా మారింది. ప్రభుత్వం ఈ భూమిని కేటాయించడంలో లాభాపేక్ష ఏమైనా ఉన్నదా? లేక ఇతర ఉద్దేశాలేనా? అన్న సందేహాలు ఎక్కువవుతున్నాయి. ఇదే తరహాలో గతంలో లూలు సంస్థకు ఆర్కే బీచ్ వద్ద 13.43 ఎకరాల భూమి, అదాని డేటా సెంటర్‌కు హిల్‌టాప్‌లో 190 ఎకరాలు, గూగుల్ డేటా సెంటర్‌కు తర్లువాడ సమీపంలో 250 ఎకరాల భూములు కేటాయించిన విషయాలు ఇప్పుడు తిరిగి చర్చకు వచ్చాయి. ప్రభుత్వం ఈ భూములన్నింటినీ ‘లీజు’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసంగా అభిప్రాయపడుతున్నారు విశాఖ ప్రజలు.