తుఫాన్ (Cyclone) ప్రభావంతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి (Chief Minister) ఎ. రేవంత్ రెడ్డి (A.Revanth Reddy) కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ (Conference) ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం, ఎక్కడా ప్రాణనష్టం, పశువులకు ఆపద జరగకుండా చర్యలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు.
తుఫాను వల్ల ప్రధానంగా వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు (Grain Procurement) లక్ష్యంగా పెట్టుకున్నామని, వర్షాలతో తడిసిన ధాన్యాన్ని, ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించాలని సీఎం ఆదేశించారు. మిల్లులు అందుబాటులో లేని చోట ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలని కలెక్టర్లకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రతి కేంద్రానికి ఇన్ఛార్జీ అధికారిని నియమించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అంతేగాక, వ్యవసాయ, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి నష్టపు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.





 



