అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, క‌న్ను పోయిందా..? – సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, క‌న్ను పోయిందా..? - సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మాట్లాడిన ఆయన, బెనిఫిట్ షోలకు, టిక్కెట్ల ధరల పెంపున‌కు ఇకపై అనుమతి ఇవ్వబోనని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపారు. అదే విధంగా అసెంబ్లీలో సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై మాట్లాడుతూ.. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సంధ్య థియేటర్ ఘటనను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. ఆరోజు అల్లు అర్జున్ అనుమతి లేకుండా వచ్చిన కారణంగా తొక్కిసలాట జరిగింది అని చెప్పారు. ఈ ఘటనలో ఒక పేద మహిళ ప్రాణాలు కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుమారుడు బ్రెయిన్ డెడ్ అయ్యి ప్రాణాలతో పోరాడుతున్నాడన్నారు. ఘటన తర్వాత అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు టాప్ లేని కారులో వచ్చి అభివాదం చేయడం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

అల్లు అర్జున్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఒక్క రోజు జైలుకు వెళ్లి వ‌చ్చిన అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్ర‌ముఖులు క్యూ క‌డుతున్నార‌ని, అల్లు అర్జున్‌కు ఏమైంది.. కాలు పోయిందా? కన్ను పోయిందా?.. లేక‌ కిడ్నీలు చెడిపోయాయా..? అని సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. ఆయన్ను అందరూ ఎందుకు పరామర్శిస్తున్నారని ప్ర‌శ్నించారు. త‌న‌ను ఎందుకు తిడుతున్నార‌ని అసెంబ్లీలో నిల‌దీశారు. పోలీసులు సంధ్య థియేటర్‌తో పాటు అల్లు అర్జున్‌పై కేసు పెట్టారని, తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో తల్లి చనిపోయి, కొడుకు చావు బతుకుల్లో ఉంటే హీరో అల్లు అర్జున్‌ పట్టించుకోకుండా సినిమా చూసుకుంటూ అక్కడే ఉన్నాడన్నారు.

ప్రీమియ‌ర్ షో టైమ్‌లో థియేటర్‌ సిబ్బంది హీరో దగ్గరికి పోలీసులను వెళ్లనివ్వలేదని, 11 రోజుల తర్వాత హీరో దగ్గరికి పోలీసులు వెళితే దురుసుగా ప్రవర్తించారన్నారు. ఈవిషయంలో పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి త‌న‌పై అడ్డగోలుగా ట్వీట్‌ చేశాడని సీఎం రేవంత్ వ్యాఖ్య‌నించారు. చనిపోయిన వాళ్లను పట్టించుకోకుండా సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్రాణాలతో చెల‌గాటం వ‌ద్దు..
సినిమా ఇండస్ట్రీ వ్యాపారాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అల్లు అర్జున్ అరెస్టును తప్పుబడుతూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నార‌ని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment