ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న తీరు గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలన్నారు. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనేదానిపైన కార్యదర్శులు, శాఖల హెచ్ఓడీలు సమీక్ష చేసుకోవాలని సూచించారు.
ఫైళ్లలో ఆర్థిక, ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లుంటాయని, ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్దతి కాదని అధికారులను హెచ్చరించారు.
ఇటీవల ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో చంద్రబాబు ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిస్థానంలో ఫరూఖ్, ఆఖరిస్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారు. సీఎం చంద్రబాబు ఆరో స్థానానికి పరిమితం కాగా, లోకేశ్ ఎనిమిది, పవన్ 10వ స్థానంలో నిలిచారు.