రాష్ట్రంలోని ఎర్రచందనం (Sandalwood) నిల్వల విక్రయం, మద్యం అమ్మకాల (Liquor Sales) ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. సచివాలయంలో మంగళవారం ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముందున్నప్పటికీ, పన్ను రూపంలో ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
ఎర్రచందనం నిల్వలపై కమిటీ
రాష్ట్రంలోని ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం ఆంధ్రరాష్ట్రానికి మాత్రమే సొంతమని, దీనిని విక్రయించడం ద్వారా పెద్దఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు. రాష్ట్రంలో ఎన్ని టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి. వాటి విలువ ఎంత అనేదానిపై కమిటీ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని సూచించారు. కమిటీ నివేదిక అనంతరం ఎర్రచందనం నిల్వలను విక్రయించి వేల కోట్లు సంపాదించాలని అధికారులకు టార్గెట్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.
మద్యం అమ్మకాల ఆదాయం పెరగాలి..
అదే విధంగా మద్యం అమ్మకాల ఆదాయం భారీగా పెంచాలని సీఎం ఆదేశించారు. 2024-25లో రాష్ట్రానికి ఎక్సైజ్ ఆదాయం రూ.28,842 కోట్లు వచ్చింది. ఈ ఏడాది మద్యం ద్వారా 33,882 కోట్లు ఆదాయం తేవాలని అధికారులకు సీఎం టార్గెట్ పెట్టారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు, అటవీ.. ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి 2025-26 సంవత్సరానికి రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,34,208 కోట్లు ఆర్జించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇది గత ఏడాది కన్నా 29 శాతం అధికం కావడం గమనార్హం.
కేంద్రం నుండి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరం మే 11 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం గతేడాది కన్నా 26 శాతం తగ్గిందని, 2024-25లో ఇదే కాలానికి కేంద్రం నుంచి రూ.17,170 కోట్లు రాగా.. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.12,717 కోట్లు మాత్రమే వచ్చింది అని అధికారులు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఆదాయం 26 శాతం తగ్గినట్టుగా అధికారులు అంగీకరించారు.








