నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని సీఎం చంద్రబాబు కోరారు. ఆశలు, ఆశయాలు నిర్దేశించుకోవాలని, వాటిని నేరవేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. రాష్ట్ర పునర్ నిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటున్నానని, ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు ప్రజలకు జగన్ విషెస్
2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం నింపాలని, ఆరోగ్యం అందించాలని, ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని జగన్ ఆకాంక్షించారు.