దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (B.R. Gavai)పై ఓ న్యాయవాది (Lawyer) దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం సృష్టించింది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతున్న సమయంలో, కిషోర్ రాకేష్ (Kishore Rakesh) అనే వృద్ధ న్యాయవాది వేదిక దగ్గరకు దూసుకెళ్లి, ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆయన్ను అడ్డుకున్నారు. దాడికి యత్నించిన ఆ న్యాయవాది “సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే” (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అని గట్టిగా అరుస్తూ కనిపించాడు. భద్రతా సిబ్బంది ఆయన్ని కోర్టు గది నుంచి బయటకు లాక్కెళ్లిపోయారు.
వివాదానికి కారణమైన సీజేఐ వ్యాఖ్యలు
ఈ దాడి యత్నానికి ప్రధాన కారణం.. ఖజురహోలోని విష్ణువు విగ్రహం కేసు విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు. ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే.. కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి” అంటూ వ్యాఖ్యానించారు. “ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కిందకు వస్తుంది. వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు, క్షమించండి” అని గవాయ్ స్పష్టం చేశారు.
మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిరసన
సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ, వ్యాఖ్యలను పునః పరిశీలించాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరో న్యాయవాది వినీత్ జిందాల్ రాష్ట్రపతికి లేఖ రాసి, హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
అయితే, దాడి యత్నం జరిగినప్పటికీ సీజేఐ గవాయ్ ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి, యథావిధిగా విచారణను కొనసాగించారు.








