చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురకంబట్టు సమీపంలోని నగరవనం వద్ద మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని మురకంబట్టు నగరవనం వద్ద ఓ మైనర్ బాలిక తన స్నేహితుడితో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు తాము ఫారెస్ట్ సిబ్బందమని నటిస్తూ ఆ జంటను నిలదీశారు. వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించడమే కాకుండా బాలికపై దాడి చేశారు. వారిలో ఒకరు బాలుడిని మాయమాటలతో పక్కకు పంపగా, మిగతా ఇద్దరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ముగ్గురూ మార్చి మార్చి బాలికను లైంగిక దాడికి గురిచేసినట్లు సమాచారం.
ఈ విషయం బాలిక స్వంత ప్రాంతం అయిన బండపల్లిలోని గ్రామస్తులకు తెలిసి నగరవనం దగ్గర కాపుకాసి నిందితులను పట్టుకున్నారు. గ్రామస్తులు అరాచకులకు దేహశుద్ధి చేసి, ఇద్దరిని చిత్తూరు తాలూకా పోలీసులకు అప్పగించగా, మరొకరు తప్పించుకొని పరారయ్యాడని సమాచారం.
ఈ ముగ్గురు తాజాగా టీడీపీ నేత లోకేష్, కార్పొరేటర్ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీకి చేరారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కారణంగా పోలీసులు మొదట లైట్‌గా తీసుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.








