మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) (MSVPG)’ విడుదలైన 24 గంటల్లోపే పైరసీ (Piracy) బారిన పడటం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతున్న సమయంలోనే సినిమా అక్రమంగా ఆన్లైన్‌లో లీక్ కావడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. పైరేటెడ్ కాపీలు పలు వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్లలో దర్శనమివ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై చిరంజీవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన మెగాస్టార్ సినిమాను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి పైరసీ చేశారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి అక్రమ చర్యల వల్ల నిర్మాతలకు భారీ నష్టం జరుగుతుందని, పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘MSVPG’ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ నమోదు చేసింది. ప్రీమియర్లు సహా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ జోరును బట్టి సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రంలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకులను అలరిస్తుండగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పియరెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హీరోయిన్‌గా నయనతార తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవిని దర్శకుడు అనిల్ రావిపూడి స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసిన విధానం సినిమాకు ప్రధాన బలంగా మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైరసీ ఆటంకాల్ని దాటుకుని ‘MSVPG’ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకూ దూసుకుపోతుందో చూడాల్సి ఉంది.








