మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రాజకీయాల్లో మరోసారి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), చిరంజీవిని ఇటీవల గట్టిగానే కోరినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఆయనను జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయమని ఆహ్వానించడమే కాకుండా, గెలిస్తే మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
భేటీ వెనుక వ్యూహం
ఇటీవల సీఎం రేవంత్ స్వయంగా చిరంజీవిని ఇంటికి పిలిచి ఈ ప్రతిపాదనను చేసినట్లు సమాచారం. అయితే, చిరంజీవి వెంటనే సానుకూలంగానో ప్రతికూలంగానో స్పందించలేదని తెలుస్తోంది. ఇప్పటికే తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, ఇద్దరూ రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటుందో? అనే సందేహం చిరంజీవిని ఆలోచింపజేసినట్టు సమాచారం. తన కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం చెప్తానని చిరు స్పందించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్‌కు అవసరమైన కౌంటర్ ఇమేజ్
ప్రస్తుతం 18 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆ వ్యతిరేకతను తిప్పికొట్టే అవకాశంగా సీఎం రేవంత్ చూస్తున్నారు. కానీ, ఇప్పటివరకు జరిపిన మూడు సర్వేల్లో కాంగ్రెస్ 10–11% ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సూచనలతోనే చిరంజీవిని రంగంలోకి దించాలన్న ఆలోచన వచ్చినట్టు చెబుతున్నారు. ఆయన సలహాతోనే ముఖ్యమంత్రి చిరంజీవిని వ్యక్తిగతంగా పిలిపించారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మైనారిటీ ఓట్లు కీలకం… అజారుద్దీన్ వెనుకకు?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.25 లక్షల మైనారిటీ ఓట్లు ఉండటంతో, కాంగ్రెస్ అధిష్ఠానం మొదట అజారుద్దీన్ వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. కానీ, సీఎం వర్గం ఆయనపై అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం, జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి కేటాయించే అవకాశం పెంచుతోంది.
“ఒక్క దెబ్బకి మూడు పిట్టలు”
పార్టీ వర్గాల అంచనా ప్రకారం చిరంజీవిని బరిలోకి దించడం ద్వారా రేవంత్ రెడ్డి మూడు ప్రయోజనాలు సాధించాలనుకుంటున్నారు:
- చిరు గెలిచి మంత్రి అయితే– పార్టీకి పాజిటివ్ ఇమేజ్
- పవన్ కళ్యాణ్ మద్దతు పొందే అవకాశం
- అజారుద్దీన్‌ను రాజకీయంగా అడ్డుకోవడం