టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా చెలామణి అవుతున్న చిరంజీవి (Chiranjeevi)పై బాలకృష్ణ (Balakrishna) చేసిన కామెంట్స్ ఏపీ (AP) రాజకీయాల్లో ఇంకా రగులుతూనే ఉన్నాయి. చిరు ఫ్యాన్స్ బాలకృష్ణపై పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్స్ ఇచ్చేందుకు సిద్ధమవ్వగా, అందుకు చిరంజీవి అడ్డుపడ్డాడు. అయినా మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఆ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. బాలకృష్ణ తీరుపై నోరుమెదపని సీఎం(CM) చంద్రబాబు (Chandrababu)పై సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరు రాజకీయ ప్రస్థానం, కుటుంబ సభ్యులపై జరిగిన మీడియా దాడిని సైతం ఫ్యాన్స్ తవ్వి తీస్తూ చర్చించుకుంటున్నారు.
చిరంజీవి కుటుంబంపై కుతంత్రాలు
చిరంజీవి కుటుంబాన్ని అవమానించడం, వారిపై దుష్ప్రచారాలు చేయడం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాకు కొత్తేం కాదు.. వారి చేతుల్లో అవమానాలు పాలవ్వడం కూడా చిరు సోదరులకు కొత్తేం కాదు.. ఎన్ని అన్నా అదే చంద్రబాబుతో పవన్ కల్యాణ్(Pawan Kalyan), నాగబాబు (Nagababu) అంటకాగుతున్నారు. చిరంజీవి కూడా వారిని ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

చిరు కుమార్తె పెళ్లి విషయంలో..
2007లో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ శిరీష్ భరద్వాజ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ ఎపిసోడ్ లో టీడీపీ(TDP) అనుకూల మీడియా నానా రాద్ధాంతం చేసిందని అభిమానులు గుర్తుచేస్తున్నారు. దీంతో చిరంజీవి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారని అంటున్నారు.
చిరంజీవి పార్టీపై తప్పుడు వార్తలు
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాష్ట్రం మొత్తం పర్యటించారు. అప్పట్లో చిరంజీవిని టార్గెట్ చేసిన చంద్రబాబుకు అనుకూలంగా ఉండే మీడియా, టీడీపీ నేతలతో ఎన్నో దుష్ప్రచారాలు చేయించారని, తిట్టించారని, ఇప్పటికీ తిట్టిస్తూనే ఉన్నారని చర్చించుకుంటున్నారు. అందులో భాగమే ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ.. వాడు అంటూ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. వీలు చిక్కినప్పుడల్లా బాలకృష్ణ మెగా కుటుంబంపై నోరు పారేసుకుంటూనే ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్పీ జెండా పీకేద్దాం అంటూ ఈనాడుతో రాతలు
చంద్రబాబు, అనుకూల మీడియా చివరికి ఎంతకు తెగించారంటే.. పీఆర్పీ స్థాపించి ఏడాది కూడా గడవకముందే.. దానిని కాంగ్రెస్ లో కలిపేస్తున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఒక బ్యానర్ స్టోరీ రాశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పీఆర్పీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేశారు. చిరంజీవికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తింది. మా జెండాను ఎవరూ పీకలేరని.. ఎందుకు గొంతు నులిమేస్తారని.. పురిటిలోనే ఎందుకు పీఆర్పీని చంపేస్తున్నారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు తమపై ఎందుకంత కక్ష అని తీవ్రస్థాయిలో స్పందించారని గుర్తుచేసుకుంటున్నారు.

2017లో చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 విడుదల అయ్యింది. ఆ సినిమాను కట్టడి చేయడానికి కూడా చంద్రబాబు అండ్ కో ప్రయత్నించారని, బాలకృష్ణ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి.. ఖైదీ నంబర్ 150పై వివక్ష చూపారని, చిరంజీవి సినిమాకు ప్రీలిరీజ్ ఫంక్షన్ కు సభను కూడా పెట్టుకోవ నివ్వలేదని గుర్తుచేసుకుంటున్నారు.
పవన్ వ్యక్తిగత జీవితంపై దాడులు
2003లో పవన్ కల్యాణ్ కు టీడీపీ నేత పరిటాల రవి గుండు కొట్టించాడంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. దీనిపై డెక్కనిక్ క్రానికల్ లో వార్త రాయించారు. దీనిపై పవన్ కల్యాణ్ అప్పట్లో డెక్కన్ క్రానికల్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. 2019లో మద్దతు ఇవ్వలేదన్న కోపంతో చంద్రబాబు తన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి పవన్ ను తిట్టించారు. ఒక దశలో పవన్ తల్లిని కూడా దూషించారు. ఈ విషయాలను పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లోనే ప్రస్తావించారు. పవన్ రహస్యాలకు సంబంధించిన వీడియోలు పెన్ డ్రైవ్ లో టీడీపీ వద్ద ఉన్నందునే ఆ పార్టీ వారు తిట్టినా పవన్ రియాక్ట్ కావడం లేదని కూడా ప్రచారం చేయించారు. జనసేన నాయకులు కిరణ రాయల్ పై అతని ప్రియురాలు లక్ష్మీ ఆరోపణలు చేసినప్పుడు, ఇటీవల కోట వినుత దంపతులు శ్రీకాళహస్తి ఇన్ ఛార్జి బొజ్జల సుధీర్ పై ఫిర్యాదు చేసినా పవన్ పట్టించుకోకపోవడానికి కారణం అదే అన్న ప్రచారం ఇంకా కొనసాగిస్తున్నారని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మోడీపై సైతం..
సాక్షాత్తూ నరేంద్ర మోడీనే వారు వదిలిపెట్టలేదు.. ఇక చిరంజీవి..పవన్ కల్యాణ్ వారికి ఒక్క లెక్కా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి 3 దఫాలుగా ప్రధాని అయిన నరేంద్ర మోడీ విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే.. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు సజీవ సాక్ష్యం అంటున్నారు. 2014లో మోడీ, పవన్ కల్యాణ్ లతో చంద్రబాబు జతకట్టారు. 2019లో వారిద్దరితో తెగదెంపులు చేసుకున్నారు. మళ్లీ 2024లో వారిద్దరూ లేకపోతే తనకు అధికారం దక్కదని గ్రహించి మళ్లీ వారితో జట్టుకట్టారు. 2019లో మోడీని వ్యతిరేకించిన చంద్రబాబు అప్పట్లో ప్రధానిని నీచాతినీచంగా దూషించారు. భార్యనే చూసుకోవడం రాని నువ్వు.. దేశాన్నేం చూసుకుంటావ్ అంటూ విమర్శలు చేశారు. అదే మోడీతో ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

అసెంబ్లీలో చిరుపై అక్కసు వెళ్లగక్కిన బాలకృష్ణ
టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి గుర్తింపు పొందడం కూడా బాలకృష్ణకు కంటగింపుగా ఉండడం వల్లే అసెంబ్లీలో అలాంటి అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్య లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలుస్తారా? అని బాలకృష్ణను పాత్రికేయులు ప్రశ్నించగా.. ఎవరివి పిలవాలో వారిని పిలుస్తాను.. నా నెత్తిమీద ఎక్కేవారిని ఎప్పుడూ పిలవను అన్నారని గుర్తుచేస్తున్నారు. 2018లో నవ నిర్మాణ దీక్ష సభలో మాట్లాడుతూ..’సంకర జాతులు కాదు.. సంకర పార్టీలు కాదు..అలగా బలగా జనాలను వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలను మనం ఇప్పుడు చూస్తున్నాం’ అంటూ జనసేనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి చిరంజీవి, ఆయన కుటుంబంపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, దీనికి చరమగీతం పాడాల్సిందేనని మెగా ఫ్యాన్స్ ఆక్రోశంతో ఉన్నారు. మరి ఈ సమస్యకు ఎలా శుభం కార్డ్ పడనుందో వేచి చూడాలి.








