బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ నివేదిక ప్రకారం, ఈ స్టేడియం పెద్ద ఈవెంట్ల నిర్వహణకు సురక్షితం కాదని తేలింది. దీంతో రాబోయే మహిళల వన్డే ప్రపంచ కప్ (Women’s ODI World Cup) (సెప్టెంబర్-అక్టోబర్) మరియు ఐపీఎల్(IPL) 2026 మ్యాచ్‌ల భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.
మహిళల వన్డే ప్రపంచ కప్‌కు భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, గత ఐపీఎల్ ఫైనల్ అనంతరం జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ (Justice) జాన్ మైకెల్ డి చున్హా కమిషన్ (John Michael D.Cunha Commission) విచారణ జరిపింది.
కమిషన్ నివేదికలో “స్టేడియం డిజైన్,(Stadium design) ఆకృతి సరిగ్గా లేదనిపిస్తోంది. ప్రేక్షకులతో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది సురక్షితం కాదు” అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇలాంటివి నిర్వహించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు పలు కథనాలు వస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీకి హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులో మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.








