చేవెళ్లలో బస్సు ప్ర‌మాదం.. ప్ర‌త్య‌క్ష‌ సాక్షి సంచ‌ల‌న విష‌యాలు

చేవెళ్లలో బస్సు ప్ర‌మాదం.. ప్ర‌త్య‌క్ష‌ సాక్షి సంచ‌ల‌న విష‌యాలు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 19 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఒక ప్రయాణికుడు తన భయానక అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. “నేను కండక్టర్ పక్కనే నిల్చున్నాను. ఒక్క క్షణం వ్యవధిలోనే టిప్పర్ బస్సును ఢీకొట్టింది. కంకర మొత్తం బస్సులోకి వచ్చేసింది. నేను దేవుడి దయతో బయటపడ్డాను. కళ్లముందే చాలామంది ప్ర‌యాణికుల‌ ప్రాణాలు పోయాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజాపూర్ హైవే పనులు పూర్తి చేయాలని, తమ ప్రాణాలకు భరోసా కల్పించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు ఆలూరు వైపు వాహనాలను మళ్లిస్తున్నారు.

ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. ఇప్పటివరకు 19 మంది మరణించారని, గాయపడిన వారిని మహేందర్ రెడ్డి మెడికల్ హాస్పిటల్ మరియు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. తాండూర్ నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరిన బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు.

అధికారులు ప్రాథమిక విచారణలో టిప్పర్ లారీ (నంబర్‌ TG 06 T 3879) పరిమితికి మించి కంకర నింపి, మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం సంభవించినట్టు తేల్చారు. లారీ ఉదిత్య అనిత పేరుతో మహబూబ్‌నగర్‌ రిజిస్ట్రేషన్‌లో ఉన్నట్టు గుర్తించారు. రవాణా అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment