చర్లపల్లి రైలు పట్టాల కింద పడి బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి జీతం, ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ విజయరెడ్డి ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారనే అంశంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటన వెనుక మానసిక కుంగుబాటు, ఒంటరితనం ప్రధాన కారణాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ చర్లపల్లిలో తల్లి విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన రెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. విజయరెడ్డి రాసిన మరణ శాసనం ఆధారంగా ఆమె తీవ్ర ఒంటరితనంతో బాధపడుతున్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. భర్త విదేశాల్లో ఉండటంతో పిల్లల జీవితంలో తల్లే అన్నీ నిర్ణయాలు తీసుకునే స్థితి ఉండేదని, అదే కారణంగా తల్లి చెప్పిన మాటను పిల్లలు ప్రశ్నించకుండా అనుసరించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఆత్మహత్యకు ముందు తల్లి పిల్లలతో కారులో మాట్లాడిన మాటలు తీవ్రంగా ప్రభావం చూపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మూడు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. దుబాయ్ నుంచి భర్త సురేందర్‌రెడ్డి వచ్చిన తర్వాత ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
నాలుగేళ్లుగా విదేశాల్లో భర్త
విజయరెడ్డి హైదరాబాద్ ఉప్పల్ రాఘవేంద్రనగర్‌లో తల్లి పుష్పలతతో కలిసి పిల్లలతో నివసిస్తున్నారు. ఆమె భర్త సురేందర్‌రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఏపీ నెల్లూరు జిల్లాకు చెందిన ఈ కుటుంబం యాదాద్రి జిల్లా బొల్లేపల్లిలో స్థిరపడింది. 2007లో సురేందర్‌రెడ్డి–విజయరెడ్డి వివాహం జరిగింది. నాలుగేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం దుబాయ్‌కు వెళ్లిన సురేందర్‌రెడ్డి ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చేవారని తెలుస్తోంది.
విజయరెడ్డి ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తూ, ఎనిమిదేళ్ల క్రితం చెంగిచర్లలో సొంత ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. నైట్ షిఫ్ట్‌లు ఉండటంతో పిల్లలిద్దరినీ హాస్టల్లో ఉంచి చదివించేవారు. సెలవులు, పండుగల సమయంలో మాత్రమే పిల్లలను ఇంటికి తీసుకొచ్చేవారని బంధువులు చెబుతున్నారు.
ఒంటరితనమే వెంటాడిందా?
భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం విజయరెడ్డిలో తీవ్ర ఒంటరితనాన్ని పెంచిందని సమీప బంధువులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తరచూ స్నేహితులు, బంధువులతో పంచుకుంటూ బాధపడేదని తెలిపారు. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు విజయరెడ్డి ఇంటి నుంచి కారులో బయల్దేరి, హాస్టల్లో ఉన్న పిల్లలను తీసుకువచ్చి రైలు పట్టాల వద్దకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
చివరి ఫోన్ కాల్స్‌పై ఫోకస్
విజయరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తున్నారు. చివరిగా మాట్లాడిన ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు. ఆమె పనిచేసే ఐటీ కంపెనీలో 15 మంది సభ్యుల బృందం ఉన్నట్టు గుర్తించారు. అందులో ఇద్దరు ఉద్యోగులతో చాటింగ్ జరిగినట్టు నిర్ధారించి వారిని విచారించారు. పని సంబంధిత అంశాలపై మాత్రమే మెసేజ్‌లు చేసుకున్నామని వారు పోలీసులకు తెలిపారు. ఇక పిల్లలు ఉపయోగించిన సెల్ఫోన్లు, కుటుంబంలో ఎలాంటి వివాదాలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.







