బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న గత తొమ్మిదిన్నరేళ్లుగా చంద్రబాబును తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వలేదని, ఒకసారి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తే తన్ని తరిమేశాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగదీష్‌రెడ్డి.
నీటి వాటాల విషయంలో తెలంగాణకు ఏమైనా అన్యాయం, ద్రోహం జరిగిందంటే దానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతుందని, దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హరీష్‌రావు సలహా ఇస్తే దానిపై కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు మించిన నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుకెళ్తుందన్నారు.
చంద్రబాబు, మోడీపై ఆరోపణలు
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీకి తలొగ్గి కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల వాటా కోసం బీఆర్ఎస్ ఎంతవరకైనా పోరాటం చేస్తుందన్నారు.







