ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై సీపీఎం తీవ్రంగా మండిపడింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్‌కు గనులు అడగకుండా, మిట్టల్ స్టీల్‌కు గనులు ఇవ్వాలని చంద్రబాబు ఎలా కోరతారని అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుకు నిరసనగా జగదాంబ సెంటర్లో సీపీఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం హెచ్చరిక
సీపీఎం నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. “వైజాగ్ స్టీల్‌ను కాపాడకపోతే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్‌కు న్యాయం చేయకపోతే, ఆ ప్రాంతం మరింత దీన పరిస్థితిలోకి వెళ్తుందని చెప్పారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పీఎంతో సమావేశమైన సందర్భంలో మిట్టల్ స్టీల్‌ప్లాంటు విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. మిట్టల్ స్టీల్ పరిశ్రమకు ఖనిజాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు, అవసరమైన అనుమతులను సాధ్యమైనంత త్వరగా వచ్చేలా చూడాలని ప్రధానిని ఆయన కోరారు.