జంతు కొవ్వు క‌ల‌వ‌లేదు.. ‘సిట్ రిపోర్ట్‌’తో బ‌ద్ధ‌లైన దుష్ప్ర‌చారం

జంతు కొవ్వు క‌ల‌వ‌లేదు.. 'సిట్ రిపోర్ట్‌'తో బ‌ద్ధ‌లైన దుష్ప్ర‌చారం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్ర‌భుత్వం చేసిన దుష్ప్రచార కుట్ర పూర్తిగా బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన ప్రచారానికి సీబీఐ దర్యాప్తు తుదిముద్ర వేసింది. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టంగా తేల్చిచెప్పింది.

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చేసిన ప్రచారమంతా తప్పు అని తేలిపోయింది. శ్రీవారి ప్రసాదానికి కళంకం తెచ్చేలా కూటమి పెద్దలు చేసిన ఆరోపణల్లో ప్రధానమైన పంది, చేప వంటి జీవుల కొవ్వు ఆనవాళ్లు నెయ్యిలో అసలు లేనే లేదని సీబీఐ నివేదిక వెల్లడించింది. హర్యానాలోని ఐసీఏఆర్ – నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) శాస్త్రీయంగా నెయ్యి నమూనాలను పరీక్షించి ఈ వాస్తవాన్ని నిర్ధారించినట్లు సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో స్ప‌ష్టం చేసింది.

సీబీఐ దర్యాప్తు పూర్తి… చార్జ్‌షీట్ దాఖలు
తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలించిన సీబీఐ దర్యాప్తును పూర్తి చేసి, తాజాగా నెల్లూరులోని ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, సీబీఐ నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలమైన మీడియాకు లీకులు ఇచ్చి మళ్లీ త‌ప్పుడు ప్ర‌చారానికి ప్రయత్నించడం గమనార్హం. అయినప్పటికీ, అసలు సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజాలు ఇప్పుడు బయటపడ్డాయి.

“టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు”
సీబీఐ నివేదిక ప్రకారం, వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అస్సలు కలవలేదు. నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి నమూనాలను ఐసీఏఆర్ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను ఈ ఏడాది మార్చి 27న ల్యాబ్‌లు అధికారికంగా నివేదించాయి.

‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షల ద్వారా కూడా నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదని నిర్ధారించారు. ముఖ్యంగా సీబీఐ నివేదికలోని ఏడో పాయింట్ (జి) అత్యంత కీలకంగా మారింది. నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైంది. జంతువుల కొవ్వులో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుందన్నది ఆహార నిపుణుల స్పష్టీకరణ. అంటే… నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదన్నది శాస్త్రీయంగా రుజువైంది.

రాజకీయ కుట్ర కోసం లడ్డూ ప్రసాదంపై దాడి
రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్టీ రామారావు, లక్ష్మీ పార్వతిలపై వ్యక్తిత్వ హననం చేసిన చంద్రబాబు, ఈసారి ఏకంగా శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంపైనే దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

2024 సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి హోదాలో ఉండి, లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని నిరాధార ఆరోపణలు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. మరుసటి రోజే ఎన్‌డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ కార్యాలయంలో విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని శ్రీ‌వారి భ‌క్తులు మండిప‌డుతున్నారు.

ల‌డ్డూపై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌కు పవన్ వత్తాసు
తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోప‌ణ‌ల‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వత్తాసు పలికారన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇంద్రకీలాద్రి మెట్లను కడగడం, దీక్ష‌లు చేయ‌డం వంటి చర్యలతో ఈ వ్యవహారాన్ని మరింత రాజకీయం చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు కూడా లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి.

త‌ప్పుడు ప్ర‌చారానికి మూల్యం త‌ప్ప‌దా..?
నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా కేవలం రాజకీయ స్వలాభం కోసం ప్రపంచ హిందూ ఆధ్మాతిక రంగానికి మకుటాయమానంగా ఉన్న తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి, దిగజార్చడానికి కూడా కూట‌మి పెద్ద‌లు వెనుకాడలేదని భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పరమపవిత్రమైన తిరుమల క్షేత్ర ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను, హిందూ మత ప్రతిష్టను, కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి, దుర్మార్గంగా తమ‌ రాజకీయాల కోసం వాడుకున్నార‌ని మండిప‌డుతున్నారు. మరి ఈ నష్టాన్ని ఎవరు భర్తీచేస్తారు?. గాయ‌ప‌డిన కోట్లాది మంది తిరుమ‌లేశుని భ‌క్తుల మ‌నోభావాల‌కు ఎవ‌రు క్ష‌మాప‌ణ చెబుతారు..? ఈ అప్రతిష్టకు కారకులైన చంద్రబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లాంటి ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎలాంటి మూల్యం చెల్లించుకుంటారో వెంక‌న్న స్వామే చూసుకుంటాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment