గుంటూరులోని KLEF (కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్) యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదైంది. ఈ మేరకు KL యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్‌తో పాటు పదిమందిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (NAAC) ‘A ++’ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లుగా కేఎల్ యూనివర్సిటీపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో దేశంలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు చేపట్టింది. చెన్నై. విజయవాడ, గుంటూరు, బెంగళూరు, భూపాల్ సహా ఢిల్లీలో విద్యా సంస్థ బ్రాంచ్‌లలో తనిఖీలు చేపట్టింది.
సీబీఐ చేపట్టిన రైడ్స్‌లో 37 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ సారధి వర్మను అరెస్ట్ చేశారు. అదే విధంగా కే ఎల్ ఈ ఎఫ్ విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజాహారం, డైరెక్టర్ రామకృష్ణలను అరెస్టు చేశారు. అదే విధంగా నాక్ ఇన్స్‌పెక్షన్ కమిటీ చైర్మన్ సమింద్రనాథ్, కమిటీ మెంబర్ రాజులను సైతం అరెస్టు చేశారు. నాక్ అక్రిడేషన్ కోసం పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు కేఎల్ యూనివర్సిటీపై ఆరోపణలు ఉన్నాయి. నాక్ కమిటీలో ఉన్న మొత్తం పదిమందిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.







