తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసిన కేసులో కీలక ఆధారాలు లభించాయని తిరుపతి పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారం విద్యా సంస్థల భద్రత, విద్యార్థుల హక్కులపై తీవ్ర చర్చకు దారితీసింది.
తిరుపతి అడిషనల్ ఎస్పీ రవిమనోహరచారి వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఫీజుల వసూళ్లపై నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్‌లను కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందగానే పోలీసులు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టగా, శేషాపురం ప్రాంతంలో ఈ కిడ్నాప్‌కు పాల్పడిన 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేరానికి ఉపయోగించిన మూడు ఇనోవా వాహనాలను సీజ్ చేయగా, అవి మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినవేనని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్‌తో పాటు బౌన్సర్లు, కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. బౌన్సర్లను స్వీయ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని, ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.
ఈ కేసులో మోహన్ బాబు, విష్ణుల పేర్లను A2, A3గా నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని, తప్పు చేసినవారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మోహన్ బాబు తిరుచానూరు పోలీసులపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉండటంతో ఈ కేసు మరింత కీలక మలుపులు తిరుగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.








