ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు పవన్ కళ్యాణ్ తన భార్య, కుమారుడు అకిరానందన్, దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి వెళ్లారు. కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన పవన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆ ఫొటోలపై వ్యంగ్యంగా స్పందించారు. దీంతో ఏపీలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్‌లలో జనసేన నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. పవన్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జగన్ ఫొటోలు విపరీతంగా మార్ఫింగ్
ఇటీవల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా దర్శనమిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ ఉపయోగించి జగన్ ఫొటోలను విచ్చలవిడిగా మార్ఫింగ్ చేశారు. దీనిపై గతంలో తిరుపతి, గుంటూరులో వైసీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు స్పందించకపోవడంతో ఠాణాల ఎదుట ఆందోళనలు చేసిన సంఘటనలు ఉన్నాయి.
పోలీసులపై విమర్శలు..
డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు మార్ఫింగ్ చేసినందుకు కేసులు బుక్ చేస్తున్న పోలీసులు.. జగన్ ఫొటోలను మార్పింగ్ చేసిన వారిపై ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని గతంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా సైతం చేశారు. చివరకు ఈ అంశంపై కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కల్పించారని, ఏపీలో అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పవన్, జగన్ ఫొటోల మార్పింగ్‌ల ఫిర్యాదులకు వర్తించే నిబంధనలు, సెక్షన్లు ఒకటే అయినప్పుడు ఒకరికి వర్తించి, మరొకరికి ఎందుకు వర్తించవని వైసీపీ యాక్టివిస్టులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.