అగ్ర రాజ్యం అమెరికా (America)లో భారతీయ పండుగల ప్రాముఖ్యత మరింత పెరిగింది. భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగ అయిన దీపావళి (Diwali)ని అధికారిక సెలవు (Official Holiday)గా ప్రకటిస్తూ కాలిఫోర్నియా (California)గవర్నర్ (Governor) గవిన్ న్యూసమ్ (Gavin Newsom) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు గవర్నర్ గవిన్ న్యూసమ్ మంగళవారం ఒక బిల్లుపై సంతకం చేసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలో దీపావళి పండుగను సెలవు రోజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ, అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లును స్టేట్ అసెంబ్లీ ఆమోదించింది.
లక్షలాది మందిలో సంతోషం:
ఆష్ కల్రా (Ash Kalra) మాట్లాడుతూ, కాలిఫోర్నియాలో అత్యధికంగా భారతీయ అమెరికన్లు (Indian Americans) నివసిస్తున్నారని, ఈ పండుగ రోజును అధికారికంగా సెలవుగా ప్రకటిస్తే లక్షలాది మంది కాలిఫోర్నియా ప్రజల్లో సంతోషం నిండుతుందని పేర్కొన్నారు. ఈ పండుగ సద్భావన, శాంతి సందేశాలతో సమాజాన్ని ఒకచోట చేర్చుతుందని ఆయన తెలిపారు.
మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా:
పెన్సిల్వేనియా, న్యూయార్క్ రాష్ట్రాల తర్వాత దీపావళికి అధికారికంగా సెలవు ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఇది భారతీయ అమెరికన్లకు ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ఈ బిల్లు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ కళాశాలలు దీపావళి రోజున అధికారికంగా మూసివేయబడతాయి. దీపావళిని సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా జరుపుకుంటారని ఈ చట్టం పేర్కొంది.
గణనీయమైన జనాభా:
2025 ప్యూ సర్వే ప్రకారం, అమెరికా దేశంలో నివసిస్తున్న 4.9 మిలియన్ల భారతీయ జనాభాలో దాదాపు 20 శాతం (960,000 మంది) కాలిఫోర్నియాలోనే నివసిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా అక్కడి భారతీయ సమాజానికి పెద్ద గౌరవం దక్కింది.





 



