‘సత్యం, న్యాయమే గెలుస్తుంది’.. ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్ హాజ‌రు

'సత్యం, న్యాయమే గెలుస్తుంది'.. ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రైన కేటీఆర్‌

ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల అవ‌క‌త‌వ‌క‌ల‌పై న‌మోదైన కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. కేటీఆర్ కోసం ఏసీబీ 30 ప్ర‌శ్న‌లు రెడీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ విచార‌ణ సంద‌ర్భంగా ఏసీబీ కార్యాల‌యం వ‌ద్ద పోలీస్ బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి. ఎఫ్ఐఆర్‌లో కేటీఆర్‌పై ఏసీబీ ప్ర‌ధానంగా ఐదు అభియోగాలు మోపిన‌ట్లుగా స‌మాచారం. నిన్న ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఏసీబీ, ఆ స్టేట్‌మెంట్ ఆధారంగా ముగ్గురు అధికారుల‌తో కూడిన బృందం కేటీఆర్‌ను ప్ర‌శ్నించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ కేసులో లాయ‌ర్ స‌మ‌క్షంలోనే విచార‌ణ జ‌ర‌గాల‌ని కేటీఆర్ కోరిన‌ప్ప‌టికీ కోర్టు కొన్ని ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తినిచ్చింది. విచార‌ణ‌కు ఒక న్యాయ‌వాదికి అనుమ‌తించిన హైకోర్టు.. కేటీఆర్ విచార‌ణ జ‌రిగే గ‌దిలోకి అనుమ‌తించ‌లేదు. వేరే గ‌దిలో కూర్చొని సీసీ టీవీ ఆధారంగా కేసు విచార‌ణ ప‌ర్య‌వేక్షించ‌వ‌చ్చ‌ని సూచించింది. కోర్టు ఆదేశాల మేర‌కు న్యాయ‌వాదితో కేటీఆర్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

కేటీఆర్ ట్వీట్‌..
ఏసీబీ విచార‌ణ‌కు ముందు కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకే ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈను ఎంతో కష్టపడి తీసుకువచ్చామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడమనే గొప్ప ల‌క్ష్యంగా ఈ కార్ రేసును ముందుకు తెచ్చామ‌ని చెప్పారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ‌లో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా ఉందని వెల్లడించారు. ఈ- మొబిలిటీ వీక్ ద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని చెప్పారు.

నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఫార్ములా-ఈ కార్ రేసు అంశం అర్థం కాలేదని విమర్శించారు. కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసన్నారు. తమ ప్రభుత్వ విజన్‌ను, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని చెప్పారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment