జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ తో ముఖ్య నేతల భేటీ
ఎర్రవల్లిలోని తన నివాసంలో బుధవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే దానిపై కేసీఆర్ వారికి పలు సూచనలు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, దానిని పార్టీకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే విషయాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. కాగా, కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లో చేరడానికి వచ్చిన మణుగూరు ప్రాంత నాయకులు, కార్యకర్తలు కూడా కేసీఆర్‌ను కలిశారు. అయితే, కవిత రాజీనామా, ప్రెస్‌మీట్‌కు సంబంధించిన అంశాలపై కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన చేయలేదని సమాచారం.
జూబ్లీహిల్స్ నేతలతో ప్రత్యేక సమావేశం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎల్.రమణ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు ముఠా జైసింహ, ఆజం ఆలీ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని డివిజన్‌ల అధ్యక్షులు, కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని ఓటరు జాబితాను డివిజన్‌లు, బూత్‌ల వారీగా లోతుగా పరిశీలించాలని నిర్ణయించారు. డివిజన్‌లు, బూత్‌ల వారీగా మైనారిటీ విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు కోరారు. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మరో సమావేశం జరుగుతుందని ముఖ్యనేతలు వెల్లడించారు.







