హైదరాబాద్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధి గురించి ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “హైదరాబాద్ అభివృద్ధి కోసం కోటి మంది ప్రజల తరఫున మా ప్రతినిధులు ప్రశ్నిస్తే, బయటకి గెంటేస్తారా?” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 8,440 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, గతంలో కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా, మరోసారి గణాంకాలు మార్చి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ప్రజా సేవలను సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గమన్నారు. “ప్రశ్నించే గొంతులను నొక్కి వేయాలని చూస్తే, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు” అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్టు చేసిన కార్పొరేటర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.







