తిరుపతి నగరం మరోసారి బాంబు బెదిరింపుతో ఉలిక్కిపడింది. ఇస్కాన్ ఆలయంలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. ఆ ఇమెయిల్‌లో మొత్తం మూడు లొకేషన్లలో IEDలు అమర్చినట్లు స్పష్టం చేశారు. దీంతో ఉదయం నుంచి అధికారులు అప్రమత్తమై, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో అత్యవసర తనిఖీలు చేపట్టారు. తప్పుగా హ్యాండిల్ చేస్తే పేలుడు సంభవించే ప్రమాదం ఉందని మరో ఈ-మెయిల్ ద్వారా కూడా బెదిరింపులు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రాధాన్య ప్రదేశాల్లో క్షుణ్ణమైన తనిఖీలు జరుగుతున్నాయి.
సీబీఐ డిమాండ్ కూడా..
ఆశ్చర్యకరంగా, అదే ఈ-మెయిల్‌లో కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో బ్లాస్టుల తర్వాత స్నైపర్ దాడులు కూడా జరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సైబర్ సెల్ అధికారులు ఈ-మెయిల్ మూలాన్ని గుర్తించేందుకు గాలిస్తున్నారు. ఇంతలోనే తిరుపతిలో భద్రతా బలగాలు అప్రమత్తంగా మోహరించాయి.
నగరంలో పలు ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు ఈ-మెయిల్స్ ద్వారా దుండగులు సమాచారం అందించారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటితో పాటు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటిని కూడా టార్గెట్ చేసినట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం సంచలనంగా మారింది. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట ఆపరేషన్ ప్లాన్ చేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో తిరుపతి నగరంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.







