అహ్మదాబాద్ (Ahmedabad)లో ఎయిర్ ఇండియా (Air India) ప్రమాదం తరువాత బోయింగ్ విమానాల్లో (Boeing Planes) వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్ (Japan Airlines)కు చెందిన JL8696 బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. జూన్ 30న చైనా షాంఘై (China Shanghai) నుంచి జపాన్ టోక్యో (Japan Tokyo)కి బోయింగ్ 737 విమానం ప్రయాణిస్తోంది.
191 మంది ప్రయాణికులున్న విమానం సుమారు 26 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక్కసారిగా విమానంలో ఆక్సిజన్ కొరత (Oxygen Shortage) ఏర్పడింది. ఆకస్మాత్తుగా కేబిన్ ప్రెజర్ పడిపోవడంతో వెంటనే ఆక్సిజన్ మాస్కులు విడుదలయ్యాయి. కొందరు నిద్రలేచి భయంతో కళ్లు తెరిచారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులకు బ్యాంక్ పిన్ నంబర్లు, ఇన్సూరెన్స్ వివరాలు, చివరి సందేశాలు పంపించడం ప్రారంభించారు.
పైలట్ తక్షణమే అత్యవసర ల్యాండింగ్ ప్రకటన చేసి, విమానాన్ని ఒసాకా (Osaka)లోని కాంసాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Kansai International Airport) మళ్లించారు. సాయంత్రం 8:50 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కానీ, విమానం గాల్లో ఉన్న సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యామని ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు. వరుస ఘటనలు బోయింగ్ సంస్థ తయారీ ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన భద్రత పరిశీలనలు మరింత తీవ్రతరం చేయనున్నారు.