ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తవుతున్న వేళ అధికార కూటమి ప్రభుత్వంలోని బీజేపీ శాసనసభ్యుడు రాసిన లేఖ ఒకటి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు ఉత్నన్నమవుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని సమస్యపై లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వార్తలు రావడం బాధాకరం..
ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన డాక్టర్ పార్థసారధి తన ప్రాంతంలోని డీఎస్పీ, సీఐ, ఎస్‌లను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆదోని పట్టణంలో పేకాట స్థావరాలను పూర్తిగా అణచివేయాలని పలుసార్లు పోలీస్ సిబ్బందిని వ్యక్తిగతంగా కలిసి సూచించినప్పటికీ, న్యూస్ పేపర్లలో మళ్లీ ఆదోనిలో పేకాట స్థావరాలు అంటూ వార్తలు రావడం చాలా బాధాకరమైన విషయమన్నారు.
ప్లీజ్ నా లేఖతో మరోసారి సూచిస్తున్నా..
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, దయచేసి తన నియోజకవర్గంలో పేకాట స్థావరాలను నిర్మూలించాలని పోలీసులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి వేడుకున్నారు. ఈ బహిరంగ లేఖ ద్వారా మరొకసారి పోలీసులకు సూచిస్తున్నా.. పూర్తి స్వేచ్ఛతో, ఎటువంటి రాజకీయ ఒత్తిడిలను పట్టించుకోకుండా, పేకాట స్థావరాలను ధ్వంసం చేయండి అంటూ అదోనిని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేని సురక్షితమైన, సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే తన కలను నెరవేర్చాలని కోరుకుంటున్నానని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
జమ్మలమడుగులోనూ పేకాట స్థావరాలు
ఇటీవల జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి అనుచరులు పేకాట క్లబ్ లు నడుపుతున్నారంటూ బీజేపీకి చెందిన ఎంపీ సీఎం రమేశ్ ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎంపీ లేఖపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన వాళ్లు తప్పు చేస్తే చెప్పుతో కొడతా.. లేదంటే ఆరోపించిన వారిని చెప్పుతో కొడతానని అంటూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా వెలిశాయని, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే వాటి నిర్వహణ జరుగుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.