ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వృద్ధి భవిష్యత్తులో మానవ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని వీరి అంచనా.
టీచర్లు, డాక్టర్లకూ ఏఐ భయం!
బిల్ గేట్స్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ అత్యంత విలువైన ఉద్యోగాలుగా భావించే టీచర్లు, డాక్టర్లు వంటి వృత్తులు కూడా కృత్రిమ మేథస్సుతో ఉచితంగా సేవలుగా మారే అవకాశముందని తెలిపారు. ఏఐ రాకతో ఎన్నో సేవలు ఉచితంగా అందుబాటులోకి రావచ్చని, ఇది అభివృద్ధి అయినప్పటికీ పెద్దసంఖ్యలో ఉద్యోగాలను నెమ్మదిగా కబళించవచ్చని అన్నారు.
మానవ మేథస్సు సర్వసాధారణం?
ఒకప్పుడు కంప్యూటర్లు ఖరీదైనవిగా ఉండేవని గుర్తు చేసిన గేట్స్, ఇప్పుడు ఆ సేవలు చాలా తక్కువ ఖర్చుతో అందుతున్నాయని తెలిపారు. ఇదే తరహాలో, ఇప్పుడు అరుదుగా కనిపించే మేథస్సు కూడా రాబోయే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాధారణమవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది అవకాశాలను కలిగించడంతోపాటు, ప్రమాదాలను కూడా తెస్తుందని అన్నారు.
‘‘మనిషికి పని లేకుండా పోతుందా?’’ – ఒబామా
ఇదే అంశంపై ఒబామా మాట్లాడుతూ.. ఏఐ మరియు ఆటోమేషన్ వల్ల అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు సంక్షోభంలోకి నెమ్మదిగా జారిపోతున్నాయన్నారు. ‘‘ఇవాల్టి వరకు మనిషి పని చేసి డబ్బు సంపాదించేవాడు. కానీ రాబోయే రోజుల్లో ఏం చేసి బతకాలో, సంపాదించాలో తెలియని స్థితి ఏర్పడొచ్చు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ అభివృద్ధి ఆవిష్కరణలకు ద్వారం తెరుస్తున్నా, ఉపాధి అవకాశాలపై మాత్రం విపరీతమైన ఒత్తిడిని పెంచుతోందని గేట్స్, ఒబామా సంయుక్తంగా హెచ్చరించారు. వీరి వ్యాఖ్యలు సామాన్య ప్రజలతో పాటు టెక్ రంగానికీ ఆలోచనకు దారితీస్తున్నాయి.