సినిమా (Cinema) విడుదలకు (Release) ముందే హై డెఫినిషన్ (HD) ప్రింట్లు బయటకు రావడం, పైరసీ (Piracy) వెబ్‌సైట్లలో (Websites) విపరీతంగా వైరల్ కావడం తెలుగు సహా భారతీయ సినీ ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. తాజాగా హ్యాకింగ్ చేసి కోట్లలో డబ్బు సంపాదించిన బీహార్ (Bihar)కు చెందిన 22 ఏళ్ల యువకుడు అశ్వనీకుమార్ (Ashwani Kumar) అరెస్టు కావడంతో, సినిమా పైరసీ వెనుకున్న నేరజాలం బయటపడింది. హైదరాబాద్ మాజీ సీపీ, తెలంగాణ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ (CV Anand)వెల్లడించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
పాట్నాలోని ఒక చిన్న ఇంట్లో కూర్చొని పలు ప్రొడక్షన్ హౌస్‌ల సైట్లను హ్యాక్ చేసిన అశ్వనీకుమార్ ఒక్కో సినిమాని 800 డాలర్లకు అమ్మేవాడు. ఇప్పటివరకు 1 లక్ష డాలర్ల వరకు సంపాదించి, వాటిని క్రిప్టో ద్వారా లావాదేవీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. తెలుగు, హిందీ, తమిళం వంటి పలు భాషల సినిమాలను పైరసీ చేసిన అతడు ‘హిట్ 3’ సినిమాని విడుదలకు 18 గంటల ముందే HD ప్రింట్‌గా ఆన్‌లైన్‌లో పెట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాకుండా సంక్రాంతి, థండేల్, గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాలను కూడా 4RABET అనే సంస్థకు విక్రయించినట్లు బయటపడింది.
సినిమాలకే పరిమితం కాకుండా, అశ్వనీకుమార్ పలు ప్రభుత్వ వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేశాడు. ఎలక్షన్ కమిషన్, సిబ్బంది జీతాల వివరాలు సహా కీలక డేటా అతని ఆధీనంలోకి వచ్చిందని దర్యాప్తులో తేలింది. ఇంటి చుట్టూ 22 సీసీటీవీలు అమర్చుకుని పోలీసులు వస్తున్నారని గమనించి, ఫోన్లలో డేటా డిలీట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే, హార్డ్ డిస్క్‌లోని ఆధారాలు తొలగించేలోపే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో జానా కిరణ్‌కుమార్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి, అతని క్రిప్టో లావాదేవీల ద్వారా పట్నాకు చెందిన అశ్వనీకుమార్ దొరికినట్టు సీవీ ఆనంద్ వెల్లడించారు.








