బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు రాష్ట్రంలో తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని ఆరోపిస్తూ విద్యార్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద పెద్దఎత్తున నిరసనలకు దిగారు. నిరసనకారులు సీఎం నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి ఉగ్రరూపం దాల్చడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
ప్రశాంత్ కిషోర్‌పై ఆరోపణలు
జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు. అయితే, నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా, ప్రశాంత్ కిషోర్ అభ్యర్థులను రెచ్చగొట్టారనే ఆరోపణలతో, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అదే విధంగా, కోచింగ్ సెంటర్ యజమానులు సహా మరో 700 మంది నిరసనకారులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పరీక్ష రద్దు డిమాండ్‌తో విద్యార్థుల ఆందోళన
డిసెంబర్ 13న జరిగిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందనే ఆరోపణలతో, విద్యార్థులు గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసి, మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అధికారులు ఈ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల వాదనలకు ఆధారాలు లేవని వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య, విద్యార్థులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.