కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి (Sri Venkateswara Swamy) కొలువైన తిరుమల కొండ (Tirumala Hill)పై పెద్ద అపచారానికి ఓ అధికారి ప్రయత్నం చేస్తున్నాడని టీటీడీ(TTD) బోర్డు మాజీ చైర్మన్, వైసీపీ(YSRCP) నేత భూమన కరుణాకర్‌రెడ్డి (Bhuma Karunakar Reddy) సంచలన ఆరోపణలు చేశారు. వేదం ఎందుకు, వేదం ఎవరికి అర్థం అవుతుంది ‘ఓం నమో వెంకటేశాయ’ అంటే సరిపోతుంది కదా అని ఓ అధికారి వేదపారాయణ దారులతో అన్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వేదపారాయణ దారులు భయంతో వణుకుతూ సంప్రదాయానికి తూట్లు పొడిచే పరిస్థితి కొండ మీద దాపురించింది అని తనతో అన్నారని భూమన వివరించారు. భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఒక ఉన్నతాధికారి వేద పారాయణంపై అవహేళనాత్మక వ్యాఖ్యలు చేయడం, అర్చకులను తనిఖీలతో వేధించడం, క్యూలైన్ భక్తులకు అడ్డంకులు సృష్టించడం, పరాకామణి ఉద్యోగుల (Parakamani Employees)పై ఒత్తిడి చేయడం వంటి చర్యలు ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. “వేదం ఎవరికి అర్థమవుతుంది? వేంకటేశ్వరస్వామి పేరు చెబితే చాలు” అని అధికారి అవహేళనగా మాట్లాడారని, ఇది సనాతన ధర్మానికి తీవ్ర అవమానమని ఆయన విమర్శించారు. ఈ చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా జరగవని, రాజకీయ జోక్యంతో ఆలయ సంప్రదాయాలను కాలరాస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేద పారాయణ సంప్రదాయం తిరుమలలో తరతరాలుగా కొనసాగుతోందని, స్కంద పురాణంలో ఆలయంలో వేద ఘోష వినిపించాలని స్పష్టంగా ఉందని భూమన గుర్తుచేశారు. టీటీడీ(TTD) ఆధ్వర్యంలో 120 ఏళ్లుగా 6 వేద పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. “వేదం బ్రహ్మదేవుని వాక్కు, జీవన సారాన్ని ప్రసాదిస్తుంది. దానిని అవమానించడం అపచారమే” అని ఆయన ఉద్ఘాటించారు. 13 పీఠాలకు చెందిన ఆశ్రమాల్లో హోమం, అన్నదానం వంటి కార్యక్రమాలను ఆపాలని నోటీసులు జారీ చేయడం, ఆర్‌ఎస్‌ఎస్ ఫిర్యాదుపై కేంద్రం టీటీడీని ఆక్షేపించడం వంటి చర్యలు సనాతన ధర్మ పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఆలయ ప్రధాన అర్చకులపై తనిఖీలు, వేధింపులు ఆందోళనకరమని భూమన విమర్శించారు. ఒక ఉన్నతాధికారి ప్రధాన అర్చకుడి ఇంట్లో వివాహానికి హాజరై “ఇంతమంది వీఐపీలు ఉన్నారు” అని అనుమానాస్పదంగా వ్యవహరించి, అర్చకులను ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులను తనిఖీ చేసినట్లు పరీక్షిస్తున్నారని భూమన ఆరోపించారు. నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు ఈ వేధింపులతో మనోవేదనకు గురవుతున్నారని, ఇటువంటి అపచారాలు కర్మఫలాన్ని తెచ్చిపెడతాయని హెచ్చరించారు. అలాగే, పరాకామణి విభాగంలో మూలసంఖ వ్యాధితో బాధపడుతున్న ఒక ఉద్యోగిని ఇబ్బంది పెట్టేలా తనిఖీలు చేస్తున్నారని, ఇది ఆలయ నిర్వహణలో మానవీయ విలువలను కోల్పోతున్నట్లు చూపిస్తుందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
తిరుమలలో క్యూలైన్‌లో భక్తులను అడ్డుకుంటూ మైక్ ఎనౌన్స్‌మెంట్స్ చేయడం, గంటలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శనం కల్పిస్తామని చెప్పిన హామీలు అమలు కాకపోవడం భక్తుల సౌకర్యానికి ఆటంకం కలిగిస్తున్నాయని భూమన విమర్శించారు. “నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు, సనాతన హిందూ జాతి కోసం ఈ అపచారాలను బయటపెడుతున్నా” అని ఆయన స్పష్టం చేశారు. భూమన చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు భూమన వ్యాఖ్యలపై స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటన తిరుమల సంప్రదాయాల పరిరక్షణపై దేశవ్యాప్త చర్చను తీవ్రతరం చేసే అవకాశం ఉంది.