ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కల సాకారానికి చేరువవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం తుదిదశకు చేరుకోగా, విమానాల రాకపోకలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల 4న భోగాపురం రన్‌వేపై తొలి విమానం టెస్ట్ ట్రయల్‌గా ల్యాండ్ కావడం ద్వారా చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దీంతో ఉత్తరాంధ్ర వాసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుండగా, మరోవైపు ఈ ప్రాజెక్టు క్రెడిట్‌పై రాజకీయ వేడి కూడా పెరుగుతోంది.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి అసలేం జరిగిందన్న అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. 2014–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపన చేసి ప్రాజెక్టును వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే భూమిపూజ చేయాలన్నదే వైఎస్ జగన్ వైఖరని, చెప్పినట్లే అన్ని అడ్డంకులు తొలగించిన అనంతరం పనులు ప్రారంభించారని వైసీపీ స్పష్టం చేస్తోంది.

వైసీపీ వాదన ప్రకారం, చంద్రబాబు నాయుడు హయాంలో మొదట 15 వేల ఎకరాలు అవసరమన్న ప్రచారం జరిగిందని, రైతుల ఆందోళనలతో అది 5 వేల ఎకరాలకు తగ్గింది. భూసేకరణ నిబంధనలు పాటించకుండా టీడీపీ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఎకరాకు రూ.12.50 లక్షల పరిహారం ప్రకటించినా భూసేకరణ కొలిక్కిరాకపోవడం, నిర్వాసితుల భవితవ్యంపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు అప్పట్లో సమస్యలుగా మారాయి. ఈ క్రమంలో రైతులు హైకోర్టును ఆశ్రయించగా, విషయం తేలకముందే ఎన్నికలు సమీపించాయి. దీంతో 2019 ఫిబ్రవరి 14న హడావిడిగా టీడీపీ శంకుస్థాపన చేసి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరిగింది.
అయితే వైఎస్ జగన్ పాలనలో భోగాపురం విమానాశ్రయానికి నిజమైన ఊపొచ్చిందని వైసీపీ చెబుతోంది. 2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని అనుమతులతో భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. 2,751 ఎకరాల భూసేకరణను పక్కాగా పూర్తి చేయడం, కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించడం, రెట్టింపు పరిహారం చెల్లించడం జరిగింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో కాలనీలు నిర్మించడమే కాకుండా, ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల పునరావాస పరిహారం అందించామని వైసీపీ వెల్లడిస్తోంది.

దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడితో జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయని, 2025 నాటికి తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో విమానాశ్రయాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్లామని వైసీపీ చెబుతోంది. భారీ విమానాలు దిగేందుకు 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టమైన రన్‌వే, ప్రహరీ నిర్మాణం, భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లైన్ల రహదారి వంటి కీలక పనులన్నీ జగన్ హయాంలోనే జరిగాయని స్పష్టం చేస్తోంది.

వైఎస్ జగన్ అన్ని అనుమతులు మంజూరు చేయించి, పనులు మొదలుపెట్టి దాదాపు 50 శాతం పూర్తిచేశారు. అయితే 2024 ఎన్నికల అనంతరం ఆయన ప్రతిపక్షంలో కూర్చోవడంతో మిగిలిన నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం 18 నెలల్లో పూర్తిచేసింది. ఈ క్రమంలో తమదంటే తమదంటూ ఇరు పార్టీలు బలమైన వాదనలు వినిపిస్తుండగా, అన్ని పర్మిషన్లు సాధించి ఎయిర్‌పోర్ట్‌లోని మేజర్ నిర్మాణ పనులు పూర్తిచేసింది జగనే అంటూ ఆసక్తికర కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది.








