కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయా? వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S. Rajasekhara Reddy) సన్నిహితుడిగా, నిఖార్సైన కాంగ్రెస్ నేత (Committed Congress Leader)గా గుర్తింపు పొందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సొంత పార్టీలోని ఒక ‘ముఖ్య నేత’ కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆ ముఖ్య నేత తన పాత మిత్రుడు, ప్రముఖ పత్రికాధిపతితో కలిసి భట్టిపై విషపు రాతలు రాయిస్తున్నారనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. చంద్రబాబు (N. Chandrababu Naidu)కు, ఆయన పార్టీకి కొమ్ముకాసే పత్రిక భట్టిపై గురిపెట్టడం వెనుక బలమైన దురుద్దేశం ఉందని మండిపడుతున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై రెచ్చిపోయి కల్పిత కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి (Andhra Jyothy) ఎండీ రాధాకృష్ణ (Radhakrishna – MD), ఇప్పుడు అదే తరహాలో భట్టి విక్రమార్కను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రచురిస్తున్నారని భట్టి అనుచరులు, కాంగ్రెస్ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భట్టి విక్రమార్క నిఖార్సయిన కాంగ్రెస్ వాది కావడం, ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం, పార్టీలో రెండో స్థానం దక్కడం, ఆయనకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ కుట్రలు మొదలయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించి స్పష్టత ఇచ్చినా, ఆంధ్రజ్యోతి పత్రికలో వరుసగా కథనాలు రావడం ఉద్దేశపూర్వకమేనని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. నైనీ కోల్‌బ్లాక్ సహా 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో అమలైన అన్ని కాంట్రాక్టులపై విచారణకు సిద్ధమని భట్టి సవాల్ విసిరినా, దానిని దబాయింపు అంటూ ఏబీఎన్ రాధాకృష్ణ చిత్రీకరించడం వెనుక కూడా అదే ‘ముఖ్య నేత’ పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
సింగరేణి టెండర్ల విషయంలో స్వార్థ ప్రయోజనాల కోసమే కట్టుకథలు అల్లుతున్నారని భట్టి ఆరోపించారు. నైనీ కాంట్రాక్టును ముఖ్యమంత్రి బావమరిదికి కట్టబెట్టాలని చూస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఇవన్నీ ఏబీఎన్ రాధాకృష్ణ సృష్టించిన వదంతులేనని కొట్టిపారేశారు. ఈ కథనాలు వేలాది సింగరేణి కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిపై గద్దలు, రాబందులు కన్నేశాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాలనివ్వబోమని భట్టి తేల్చిచెప్పారు.
కాంట్రాక్టు సంస్థలు సైట్ విజిట్‌కు వెళ్లాలన్న నిబంధన కొత్తది కాదని భట్టి స్పష్టం చేశారు. కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, రక్షణ శాఖ సహా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇదే విధానం అమల్లో ఉందని తెలిపారు. ఈ నిబంధనను తానే ప్రవేశపెట్టినట్టు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, టెండర్ల ఫైళ్లు తన వద్దకు రావని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే టెండర్లను రద్దు చేశామని వివరించారు.
విషపు రాతలపై హెచ్చరిక
‘పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలతో సింగరేణిపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం’ అంటూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు భట్టి విక్రమార్క హెచ్చరికలు జారీ చేశారు. పత్రికాధిపతి అని ఏది రాసినా చెల్లుతుందనుకోవడం పొరపాటేనని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వాన్ని ఒక్క కలం పోటుతో దెబ్బతీయాలనుకుంటే సహించేది లేదని, ఇప్పటికైనా తప్పుడు కథనాలను అంగీకరించాలని భట్టి డిమాండ్ చేశారు.
నిఖార్సయిన కాంగ్రెస్ వాదులకు దక్కే గౌరవం ఇదేనా..?
సింగరేణి కాంట్రాక్టుల వ్యవహారానికి ముఖ్యమంత్రి లేదా ఆయన బావమరిదికి ఎలాంటి సంబంధం లేదని భట్టి స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వానికి ఎలాంటి మచ్చ రావొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యమంత్రికి కుర్చీకి కూడా ఎలాంటి మరక అంటించకుండా సమాధానాలిచ్చినప్పటికీ, రాధాకృష్ణ విషపు రాతల కల్పిత కలం అగిపోలేదని ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రజలు, భట్టి అనుచరులు మండిపడుతున్నారు. దీని వెనుక బలమైన పాత్ర ఉందని, ఆ అండ చూసుకొనే రాధాకృష్ణ రెచ్చిపోతున్నారని ఫైరవుతున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్‌తోనే మొదలుపెట్టి, ఏ దిక్కులూ చూడకుండా, అదే పార్టీలో అగ్ర నాయకత్వ స్థాయికి ఎదిగిన భట్టి విక్రమార్క వ్యక్తిత్వానికి మరకలు అంటిస్తున్న వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ వాదులంతా ఏకం కావాల్సిన సమయం దగ్గరపడినట్లుగా కనిపిస్తోంది.







