ఇండియాలో (India) బెట్టింగ్ యాప్‌ల (Betting Apps) ప్రచారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ప్రముఖ క్రికెటర్లు రోబిన్ ఉతప్ప (Robin Uthappa), యువరాజ్ సింగ్ (Yuvraj Singh)తో పాటు నటుడు సోను సూద్ (Sonu Sood) పేర్లు ఈ కేసులో వెలుగులోకి రావడంతో అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై వీరిని విచారించేందుకు ED సిద్ధమవుతోంది. ముఖ్యంగా రోబిన్ ఉతప్ప విషయంలో మనీలాండరింగ్ (Money Laundering) నిబంధనల ఉల్లంఘన కోణాన్ని అధికారులు గమనిస్తున్నారు.
ED షెడ్యూల్ ప్రకారం రోబిన్ ఉతప్ప సెప్టెంబర్ 22న, యువరాజ్ సింగ్ సెప్టెంబర్ 23న, సోను సూద్ సెప్టెంబర్ 24న విచారణకు హాజరుకానున్నారు. వీరి వాంగ్మూలాలను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద నమోదు చేయనున్నారు. ఈ దర్యాప్తు ప్రధానంగా 1xBet అనే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించినదిగా సాగుతోంది. ఇదివరకే శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి క్రికెటర్లు, అలాగే ఉర్వశీ రౌతేలా, మిమి చక్రవర్తి, అంకుష్ హజ్రా వంటి నటులను కూడా ED ప్రశ్నించింది.
మరోవైపు టాలీవుడ్‌కు చెందిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ సహా మొత్తం 25 మంది నటులు బెట్టింగ్ యాప్‌ల ప్రచార కేసులో బుక్ కావడం సంచలనం సృష్టించింది. అక్రమ బెట్టింగ్ యాప్‌లు కోట్ల రూపాయల మేర వినియోగదారులను మోసం చేశాయన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ యాప్‌లు తమను స్కిల్-బేస్డ్ గేమ్స్‌గా చూపించుకున్నప్పటికీ, వాస్తవానికి గ్యాంబ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయా? సెలబ్రిటీలు అవి అక్రమమని తెలిసే ప్రచారం చేశారా? లేక తెలియక ప్రమోట్ చేశారా? అనే కీలక అంశాలపై ED లోతైన విచారణ చేపట్టింది.








